16 మంది రెబల్స్కు అనర్హత నోటీసులు

16 మంది రెబల్స్కు అనర్హత నోటీసులు

ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన జాతీయ కార్యనిర్వాహక కమిటీ భేటీ శనివారం మధ్యాహ్నం ముంబైలోని శివసేన భవన్ లో జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఏక్ నాథ్ షిండేతో కలిసి తిరుగుబావుటా ఎగరేసిన 38 మంది ఎమ్మెల్యేలపై ఏవిధమైన చర్యలైనా తీసుకునే పూర్తి అధికారాన్ని పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు కట్టబెడుతూ శివసేన కార్యనిర్వాహక కమిటీ తీర్మానం చేసినట్లు సమాచారం. పార్టీ పేరును  బయటి వ్యక్తులెవరూ వినియోగించరాదనే మరో తీర్మానాన్ని కూడా చేశారని తెలుస్తోంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ వర్గానికి ‘శివసేన బాలాసాహెబ్’ అని పేరు పెట్టుకున్న నేపథ్యంలో ఈ తీర్మానం చేశారు. కొవిడ్ లక్షణాలు ఉండటంతో ఈ సమావేశానికి ఉద్ధవ్ థాక్రే వర్చువల్ గా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రెబల్ ఎమ్మెల్యేలంతా కలిసి పార్టీని చీల్చే కుట్ర పన్నారని ఆరోపించారు.  

న్యాయ నిపుణులతో ఏక్నాథ్ అండ్ టీం.. 

మరోవైపు 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ శివసేన చేసిన ఫిర్యాదుపై డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ స్పందించారు. సోమవారం (జూన్ 27న) సాయంత్రం 5 గంటల్లోగా అనర్హత పిటిషన్ పై వివరణ ఇవ్వాలంటూ వారందరికీ అనర్హత నోటీసులు జారీచేశారు. గడువులోగా రాతపూర్వక వివరణలు సమర్పించాలని నిర్దేశించారు. అయితే డిప్యూటీ స్పీకర్ నుంచి నోటీసులు అందిన తర్వాత ఏక్ నాథ్ షిండే తో కూడిన రెబల్ ఎమ్మెల్యేల బృందం గౌహతి (అస్సాం) లో న్యాయ నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమై న్యాయ సందేహాలు నివృత్తి చేసుకున్నట్లు తెలిసింది. 

జూలై 10 వరకు ముంబైలో 144 సెక్షన్

రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మహారాష్ట్రలోని శివసేన రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పలువురు రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై శివసేన సైనికులు దాడులు చేశారు. ఇరువర్గాలు పరస్పరం హెచ్చరికలు చేసుకుంటున్నారు. మరోవైపు ఏక్ నాథ్ షిండే కు మద్దతుగానూ ఫ్లెక్సీలు, ప్లకార్డులతో కొందరు రోడ్లపైకి వస్తున్నారు. ఈనేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూసే ఉద్దేశంతో జూలై 10 వరకు ముంబైలో 144 సెక్షన్ ను విధిస్తున్నట్లు నగర పోలీసు విభాగం ప్రకటించింది.