సబ్​మెరైన్​లో డ్రగ్స్​.. బోట్లతో చేజ్

సబ్​మెరైన్​లో డ్రగ్స్​.. బోట్లతో చేజ్
  • హాలీవుడ్ సినిమాల రీతిలో కోస్ట్గార్డుల సాహసం
  • 17,690 కిలోల కొకైన్​తోవెళ్తున్న సబ్మెరైన్
  • పసిగట్టిన అమెరికా నేవీ.. బోట్లతో వెంబడించిన గార్డులు
  • వేగంగా వెళ్తున్న సబ్మెరైన్ పైకి దూకిన గార్డు
  • స్మగ్లర్ల అరెస్టు,రూ.15 వేల కోట్ల విలువైన డ్రగ్స్​ స్వాధీనం

కొండను కూడా ఢీకొట్టేంత వేగంగా వెళ్తున్న ఓ సబ్​మెరైన్. దాన్ని వెంబడిస్తున్న రెండు చిన్న బోట్లు.. హాలీవుడ్ సినిమాలను మించిన చేజింగ్ అది. జేమ్స్ బాండ్, ఫాస్ట్​అండ్ ఫ్యూరియస్, మిషన్ ఇంపాజిబుల్ సినిమాలకు ఏం మాత్రం తీసిపోని యాక్షన్ సీన్ అది. ప్రతి క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేపిన సన్నివేశమది. ప్రాణభయం లేకుండా హాలీవుడ్ హీరోల స్టైల్​లో అడ్వెంచర్లు చేసిన సైనికులను చూసి ఏకంగా అమెరికా అధ్యక్షుడే ‘ఔరా’ అన్నారు. ‘చూడండి మా సోల్జర్ల ధైర్య సాహసాలు’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఇంతకీ ఏంటా వీడియో? ఎవరా సైనికులు? ఎందుకు చేజింగ్???

నడి సముద్రం.. అనుమానాస్పద సబ్​మెరైన్

అమెరికాకు చెందిన ఓ నిఘా విమానం..పసిఫిక్ ఓషన్ పై వెళ్తోంది. ‘అంతా సాఫీగా ఉంది’ అంటూ చెబుతున్నాడు పైలట్. పక్కకి చూశాడు. తూర్పున నడి సముద్రంలో కదలిక. పెద్ద షార్క్ వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. కొంచెం పరిశీలించి చూస్తే.. అదో సబ్​మెరైన్. అనుమానాస్పద సెమీ సబ్​మెరైన్. దాన్ని నార్కో సబ్​మెరైన్ అని కూడా అంటారు. కొకైన్​ను తరలించేందుకు స్మగ్లర్లు వినియోగించే అత్యాధునిక మెరైన్ అది. అమెరికా వైపుగా వెళ్తోంది. వెంటనే అలర్ట్ అయ్యాడు పైలట్. అందరికీ సమాచారం పంపాడు. దీంతో వెంటనే యూఎస్ కోస్ట్​గార్డ్ కట్టర్ మున్రో సైనికులు రంగంలోకి దిగారు.

రెండు బోట్లతో చేజింగ్..

అతి వేగంతో దూసుకుపోతున్న సబ్-మెరైన్ ని రెండు చిన్న బోట్లు వేసుకుని సైనికులు వెంబడించారు. దాని దగ్గరకు చేరుకున్నారు. గట్టిగా అరుస్తూ దాన్ని ఆపాలని ప్రయత్నించారు. కానీ స్మగ్లర్లు ఇంకా వేగం పెంచుతున్నారు. దీంతో బోటు కూడా స్పీడు పెంచారు. సబ్​మెరైన్​పక్కన వేగంగా వెళ్తోంది బోటు. ఈ సమయంలో ఓ గార్డు ఉన్నట్టుండి దానిపైకి దూకాడు. అచ్చం హాలీవుడ్ హీరోలా. అంత స్పీడులో ఏ మాత్రం పట్టు తప్పినా, కిందికి జారినా ఇక అతడి సంగతి అంతే. ప్రాణాలు దక్కేవి కావు. దూకాక సూపర్​మ్యాన్​లా నిలుచున్నాడు. అతడి వెంటే మరో గార్డు కూడా దూకాడు. తర్వాత ముందుకు నడుచుకుంటూ వెళ్లి ‘హ్యాచ్’ (మూత) డోర్​పై చేతులతో బలంగా బాదాడు గార్డు. దాన్ని ఓపెన్ చేశాడు. ఎదురుగా స్మగ్లర్. గార్డును చూసి అదిరిపోయాడు. ‘కింద పడుకో. లేకుంటే కాల్చి పారేస్తా’ అంటూ గార్డు గద్దించాడు అతడిని. సీన్ కట్ చేస్తే.. కొరొనాడోలోని నేవల్ ఎయిర్​స్టేషన్​కు స్మగ్లర్లను కొకైన్​ను తరలించారు.

రూ.వేల కోట్ల సరుకు

సబ్​మెరైన్ లో స్మగ్లర్లు తరలిస్తున్న కొకైన్ కిలో, రెండు కిలోలు కాదు. 39 వేల పౌండ్లు. మన భాషలో చెప్పాలంటే 17,690 కిలోలు. అంతేకాదు.. 933 పౌండ్ల (423 కిలోలు) గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ విలువ రూ.15 వేల కోట్లకు పైనే ఉండొచ్చని అంచనా. ఇలా డ్రగ్స్ తరలించడం ఇటీవల పెరిగిపోయింది.

నార్కో సబ్​మెరైన్స్!

నార్కో సబ్​మెరైన్స్​ను స్మగ్లింగ్ కోసమే ప్రత్యేకంగా డ్రగ్ ట్రాఫికర్లు తయారు చేస్తారు. నిషేధిత వస్తువులను తీసుకెళ్లేటప్పుడు లా ఎన్ఫోర్స్​మెంట్ అధికారుల నుంచి తప్పించుకునేందుకు సెల్ఫ్ ప్రొపెల్ల్​డ్ సెమీ సబ్​మెర్సిబుల్(ఎస్​పీఎస్ఎస్) మాదిరి రూపొందిస్తారు. వీటిని డైరెక్టుగా కానీ, రాడార్, సోనార్, ఇన్​ఫ్రా రెడ్ సిస్టమ్స్ ద్వారా కానీ గుర్తించడం కష్టం. కొలంబియన్ డ్రగ్ స్మగ్లర్లు ఎక్కువగా వాడుతుంటారు. కొలంబియా నుంచి మెక్సికోకు, అటు నుంచి అమెరికాకు డ్రగ్స్ తరలిస్తారు. ఇటీవల వీటి వినియోగం పెరిగింది. అలాగే అమెరికా అధికారుల నుంచి తప్పించుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. వీరికి పెద్ద నెట్​వర్క్ ఉంది.