రూ.49 కోట్లు విలువ చేసే మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం

రూ.49 కోట్లు విలువ చేసే మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం

హైదరాబాద్‌, వెలుగు: హైదరాబాద్ సిటీ శివార్లలో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టైంది. ఫార్మా ల్యాబ్స్‌లో మెఫెడ్రోన్ డ్రగ్‌ తయారు చేస్తున్న సెంటర్లపై డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రెవెన్యూ (డీఆర్‌‌ఐ) అధికారులు రెయిడ్స్‌ చేశారు. 21 నుంచి ఉప్పల్‌, చెంగిచర్ల, ఐడీఏలో జరిపిన తనిఖీలకు సంబంధించిన వివరాలను డీఆర్‌‌ఐ సోమవారం వెల్లడించింది. సోదాల్లో రూ49.77 కోట్లు విలువ చేసే 24.885 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని, దేశవ్యాప్తంగా ఈ నెట్​వర్క్​ ఉందని, ఇంకొందరి కోసం గాలిస్తున్నామని పేర్కొంది.

గోరఖ్‌పుర్‌‌లో కీలక నిందితుడు, ఫైనాన్సర్‌ను అరెస్ట్​ చేశామని తెలిపింది. రూ.60 లక్షలతో నేపాల్‌ పారిపోతుండగా పట్టుకుని తీసుకొచ్చినట్టు వివరించింది.నిందితులంతా పాత నేరస్తులుగా గుర్తించారు. ఈ ఏడాది నవంబర్ దాకా 990 కిలోల హెరాయిన్, 88 కిలోల కొకైన్, 10,000 మెథాంఫేటమిన్ ట్యాబ్లెట్స్‌, 2,400 లీటర్ల ఫెన్సెడైల్ దగ్గు సిరప్​ స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌‌ఐ వెల్లడించింది.