
తెలంగాణ తెచ్చిందే సిద్ధిపేట .. సిద్దిపేట లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. అభివృద్ది అంతా మెదక్ లోనే జరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి...ఇపుడు సిద్దిపేటకు బీఆర్ఎస్ చేసిందేమి లేదంటున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే సిద్ధిపేట పుణ్యమేనని చెప్పారు.
తన చాలెంజ్ ను సీఎం రేవంత్ ఇప్పటికీ స్వీకరించలేదన్నారు హరీశ్ రావు. ఆరుగ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేయడానికి సిద్దమని మరోసారి చెప్పారు. పదవుల కోసం విలువలు లేని రాజకీయాలు చేయనన్నారు .తన పదవి కంటే ప్రజల మేలే ముఖ్యమన్నారు. వందరోజులపై మీ బాండ్ పేపర్ బౌన్స్ అయిందన్నారు. రేవంత్ రెడ్డి నాడు బాండ్ పేపర్లు, ఇపుడు గాడ్ ప్రామిస్ లు చేస్తున్నారని చెప్పారు. ఒకరు దేవున్ని చూయించి మరొకరు దేవునిపై ఒట్టేసి ఓట్లడుగుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యిందన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూములు విలువ బాగా పడిపోయాయని.. రాష్ట్రం దివాల తీసిందని ముఖ్యమంత్రి అనడంతో పెట్టుబడులు రాకుండా పోయాయన్నారు. దీంతో రాష్ట్ర ఆదాయం పడిపోయిందన్నారు.