రాంచీ: అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ మేరకు గవర్నర్ రమేశ్ బాయిస్ కు సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే ఈసీ సిఫార్సుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. సోరెన్ తన పేరు మీద మైనింగ్ లీజు తీసుకున్నారని, ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడడమేనని ఫిబ్రవరి 11న గవర్నర్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరింది. దీనిపై గవర్నర్ ఎలక్షన్ కమిషన్ అభిప్రాయం కోరారు. విచారణ చేపట్టిన ఎలక్షన్ కమిషన్.. ఇరుపక్షాల వాదనలు విన్నది. బుధవారం సీల్డ్ కవర్లో తన రిపోర్టును గవర్నర్‌కు పంపింది. ‘‘సోరెన్ పై వేటు వేయాలని ఈసీ సిఫార్సు చేసింది. ఆ లెటర్ గవర్నర్ కు చేరింది. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి” అని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే అన్నారు.
ఒకవేళ సోరెన్‌పై అనర్హత వేటు వేసినప్పటికీ, తమ ప్రభుత్వం కొనసాగుతుందని మంత్రి అలంగీర్ ఆలం చెప్పారు. తమ లీడర్‌గా సోరెన్ కొనసాగుతారని తెలిపారు. ఎన్నికైనప్పటి నుంచీ తమ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ చూస్తోందని, కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య అన్నారు. కాగా, జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ప్రభుత్వం ఉంది. జేఎంఎంకు 30 మంది, కాంగ్రెస్ కు 17 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉండగా.. ప్రతిపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకెలాంటి సమాచారం లేదు: సోరెన్ ఈసీ రిపోర్టుపై తనకెలాంటి సమాచారం లేదని సోరెన్ చెప్పారు. ఆ రిపోర్టును బీజేపీ నేతలే తయారు చేశారని ఆరోపించారు.

