ఫినిక్స్‌, సాహితీపై ఈడీ కొరడా

ఫినిక్స్‌, సాహితీపై ఈడీ కొరడా

హైదరాబాద్‌, వెలుగు: రియల్‌ఎస్టేట్, ఫార్మా కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) నజర్ పెట్టింది. ఫినిక్స్‌ టెక్‌ జోన్‌ ప్రాపర్టీస్‌,సాహితీ ఇన్‌ఫ్రా పల్స్‌ ఫార్మా సహా పలు సంస్థల్లో సోదాలు చేస్తోంది. తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమైన తనిఖీలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని  రోడ్‌ నెంబర్ 45లోని ఫీనిక్స్ కార్పొరేట్ ఆఫీస్‌ సహా మొత్తం 20 అనుబంధ సంస్థల్లో ఈడీ సెర్చెస్ చేస్తోంది. డైరెక్టర్లు శ్రీధర్‌‌రావు, గోపికృష్ణ ఇండ్లు, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, పటాన్‌చెరు, శంషాబాద్‌లోని కంపెనీలు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. మాదాపూర్‌‌లోని పల్సెస్ ఫార్మా, జునెన్‌ ఫార్మా కంపెనీల్లో తనిఖీలు జరుగుతున్నాయి. సుమారు100 మంది అధికారులతో కూడిన15 టీమ్స్‌ ఈ సోదాల్లో పాల్గొన్నాయి.సెంట్రల్‌ ఫోర్సెస్ బందోబస్తులో తనిఖీలు చేస్తున్నారు. 

మనీలాండరింగ్‌.. హవాలా లెక్కలు తీస్తున్నారు

ప్రీ లాంచ్‌ పేరుతో శంషాబాద్‌లో భారీ వెంచర్స్‌, దేశవిదేశాల్లో భారీ ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. ఫినిక్స్ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై గతేడాది ఆగస్టులోనే ఐటీ సోదాలు చేసింది. ఫినిక్స్‌ అనుబంధ సంస్థల్లో వారం రోజులకు పైగా తనిఖీలు చేసింది. 2‌‌‌‌014 నుంచి గతేడాది మార్చి వరకు ఆర్థిక లావాదేవీలు, ఐటీ చెల్లింపుల వివరాలు సేకరించింది. ఈ క్రమంలోనే దేశవిదేశాల్లో రూ.వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్స్ పై ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఐటీ సెర్చెస్‌లో పలు షెల్‌ కంపెనీలను కూడా గుర్తించినట్లు సమాచారం. ఐటీ రిపోర్ట్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీలాండరింగ్, హవాలా క్యాష్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌పై ఆధారాలు సేకరించేందుకు సోదాలు నిర్వహిస్తున్నది.