అంగన్​వాడీలకు గుడ్ల సప్లయ్​ బంద్

అంగన్​వాడీలకు గుడ్ల సప్లయ్​ బంద్
  • నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో నిలిచిన సరఫరా 
  • బిల్లులు చెల్లించకపోవడంతో ఆపిన పౌల్ట్రీ కాంట్రాక్టర్లు
  • కొవిడ్​భయంతో పలుచోట్ల ముందుకురాని ట్రాన్స్​పోర్టర్లు
  • మహిళలు, చిన్నారులకు అందని పౌష్టికాహారం

నల్గొండ, వెలుగు: కొవిడ్, లాక్​డౌన్​ పరిస్థితులకుతోడు ప్రభుత్వం నుంచి సక్రమంగా బిల్లులు రాకపోవడంతో పలు జిల్లాల్లో అంగన్ వాడీ కేంద్రాలకు గుడ్ల సప్లయ్​ ఆగిపోయింది. గడిచిన ఆరునెలల నుంచి సర్కారు బిల్లులు చెల్లించకపోవడంతో గుడ్లు సరఫరా చేయలేకపోతున్నామని కాంట్రాక్టర్లు అంటుండగా, కొన్నిచోట్ల కొవిడ్​భయంతో సప్లయ్ చేసేందుకు ట్రాన్స్​పోర్టర్లు ముందుకురావడం లేదు. ఫలితంగా నల్గొండ, సూర్యాపేట లాంటి జిల్లాల్లో ఏప్రిల్, మే నెలల్లో గుడ్ల సప్లయ్ సక్రమంగా జరగడం లేదు.  కొన్ని ప్రాజెక్టుల పరిధిలో డిసెంబర్ నుంచి బిల్లులు చెల్లించలేదు. దీంతో  ఆయా ఏరియాల్లో రెండు, మూడు నెలలుగా గుడ్లను ఆపేయడంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందిపడుతున్నారు.

బిల్లులు పాస్​ కావట్లే..
అంగన్​వాడీ సెంటర్లకు గుడ్ల సప్లయ్ ఆగిపోవడానికి ఆఫీసర్లు రకరకాల కారణాలు చెప్తున్నారు.  ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రావాల్సిన బిల్లులు గడిచిన ఆరు నెలలుగా నయాపైసా రిలీజ్ కాలేదు. జిల్లా ఆఫీసర్లు బిల్లులు క్లియర్ చేసి ట్రెజరీలకు పంపిస్తున్నా పాస్ కావడం లేదు. దీంతో పౌల్ట్రీ కాంట్రాక్టర్లు గుడ్ల సప్లయ్​లో ఇబ్బందులు పెడ్తున్నారు. గుడ్లతో పాటు అంగన్​వాడీ సెంటర్లకు సప్లయ్ చేస్తున్నవివిధ రకాల ఫుడ్​ఐటమ్స్​దీ ఇదే పరిస్థితి. పిండి, దాల్ పంపిణీ జరుగుతున్నా  పాలు, మొరమరాలు కూడా సప్లయ్ కావడం లేదని ప్రాజెక్టు ఆఫీసర్లు చెప్తున్నారు. నల్గొండ జిల్లాలో అయితే ఏప్రిల్, మే నెలల్లో గుడ్ల సప్లయ్ నిలిచిపోయింది.  ఈ జిల్లా లో కొండమల్లేపల్లి, దామచర్ల ప్రాజెక్టులకు డిసెంబర్ నుంచి పేమెంట్స్ ఆగిపోయాయి. మొత్తం 9 ప్రాజెక్టుల్లో మిగిలిన ఆరు ప్రాజెక్టులకు జనవరి నుంచి ఇప్పటిదాకా పేమెంట్స్ చేయలేదు. ఒక్కో ప్రాజెక్టు పరిధిలో నెలకు రూ.10, 12 లక్షల వరకు బిల్స్ పెండింగ్​లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ జిల్లాలోనూ జనవరి నుంచి బిల్లులు ఆగి పోయాయి. నాలుగు ప్రాజెక్టులకు కలిపి సుమారు రూ.2 కోట్ల వరకు బకాయిలు పెండింగ్​పడ్డాయి. ఆఫీసర్లు మాత్రం సమ్మర్​లో  గుడ్ల ప్రొడక్షన్ తక్కువగా ఉండడం వల్లే కాంట్రాక్టర్లు సప్లయ్ చేయడం లేదని చెబుతున్నారు.

కొవిడ్​ వల్ల టైం తప్పుతోంది.. 
సాధారణ రోజుల్లో ప్రతి నెలా మూడు విడతల్లో గుడ్లు సప్లయ్ చేసేది. కానీ ప్రస్తుతం టేక్ హోం సిస్టమ్ కాబట్టి రెండు విడతల్లో సప్లయ్ చేస్తున్నారు. గత మూడు నెలలుగా ఈ టైం పాటించడం లేదు. గుడ్లు ఎప్పుడు వస్తాయో కూడా అంగన్​వాడీ టీచర్లు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరిగిపోతుండడంతో గుడ్లు తెచ్చేందుకు ట్రాన్స్​పోర్టర్లు భయపడ్తున్నారు. మరోవైపు పౌల్ట్రీ కాంట్రాక్టర్లు, ట్రా న్స్ పోర్టర్లలో కొందరు కరోనా బారిన పడ్డారని, దీని వల్ల కూడా సప్లయ్ పై ఎఫెక్ట్​ పడుతోందని ఆఫీసర్లు చెప్తున్నారు.  

బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి 
సప్లయ్ ఏజెన్సీలకు జనవరి నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీంతో పౌల్ట్రీ కాంట్రాక్టర్లు ఎగ్స్ సప్లయ్ చేయడం లేదనే విషయం మాదృష్టికి వచ్చింది. అ దేవిధంగా కొందరు ట్రాన్స్​పోర్టర్లకు, పౌల్ట్రీ యజమానులకు కూడా కొవిడ్​ సోకిందని తెలిసింది. కేసులు పెరిగిపోవడంతో ఊళ్లలోకి పోమని చెబుతున్నారు. దీంతో వాళ్లను పిలిపించి మాట్లాడుతున్నం. త్వరలోనే గుడ్లు సప్లయ్ చేసేలా చర్యలు తీసుకుంటం.
- సుభద్ర,  డీడబ్ల్యూఓ, నల్గొండ జిల్లా