V6 News

గుజరాత్​లో కాంగ్రెస్ ఎన్నికల హామీలు

గుజరాత్​లో కాంగ్రెస్ ఎన్నికల హామీలు

ఉచితంగా అవయవ మార్పిడి చికిత్స 
ఆడపిల్లలకు నెలకు రూ.3 వేల సాయం


అహ్మదాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాత్​లో కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ రూ.10 లక్షల వరకు ఉచితంగా ట్రీట్​మెంట్ అందిస్తామని చెప్పింది. ‘జన్ ఆరోగ్య సంకల్ప్ పత్ర’ పేరుతో హెల్త్ కేర్ మేనిఫెస్టోను శనివారం విడుదల చేసింది. రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షుడు జగదీశ్ ఠాకూర్ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ఆమోదించిన ప్రైవేటు దవాఖాన్లలోనూ రూ.10 లక్షల వరకు ప్రజలందరికీ ఉచిత చికిత్స అందిస్తామని చెప్పారు. ఉచితంగా గుండె, కాలేయం, కిడ్నీ మార్పిడి చికిత్సలు కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, సివిల్ ఆస్పత్రులన్నింటినీ కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతామన్నారు. ఆరోగ్య రంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలు సాధించేందుకు హెల్త్ బడ్జెట్​ను పెంచుతామని తెలిపారు. ప్రతీ గ్రామంలో జనతా డిస్పెన్సరీలు ఓపెన్ చేస్తామని, మొబైల్ ప్రభుత్వ ఆస్పత్రులను ప్రారంభిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నామని చెప్పారు. అన్ని హెల్త్ సెంటర్ల వద్ద జనరిక్ మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేస్తామని, డాక్టర్లు, నర్సులు, సిబ్బందిని ఫుల్ టైమ్ ప్రాతిపదికన నియమిస్తామని వెల్లడించారు. ఆయుర్వేద, యునాని, హోమియోపతి చికిత్సలను ప్రోత్సహిస్తామన్నారు. హెల్త్ కేర్​కు సంబంధించిన హామీలను తాము రాజస్థాన్, చత్తీస్​గఢ్​లలో అమలు చేశామని ఠాకూర్ గుర్తు చేశారు. గుజరాత్​లో 125 కు పైగా సీట్ల గెలుపు లక్ష్యంగా పెట్టుకున్నామని, అధికారంలోకి వచ్చాక హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. 

ఆడపిల్లలే ఉన్న కుటుంబానికి రూ.30 లక్షలు...
ఆడవాళ్ల జనన రేటు తక్కువగా ఉన్న వర్గాలను గుర్తిస్తామని, అలాంటి వర్గాల కుటుంబాల ఆడపిల్లల బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ. 3,000 జమ చేస్తామని చెప్పారు. ఆడపిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాలకు వృద్ధాప్యంలో రూ.30 లక్షల సాయం అందజేస్తామని పేర్కొన్నారు.