చెన్నై సూపర్ కింగ్స్ కు రైనా దూరమైనట్లేనా?

చెన్నై సూపర్ కింగ్స్ కు రైనా దూరమైనట్లేనా?

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ కీలక ప్లేయర్ సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం ఈ విషయంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యూఏఈలో తనకు కేటాయించిన రూమ్ నచ్చకనే రైనా వెళ్లిపోయాడని సమాచారం. రైనా అనూహ్య నిష్క్రమణపై సీఎస్కే యాజమాన్యం గుర్రుగా ఉందని సమాచారం. ముఖ్యంగా దీనిపై సీఎస్కే ఓనర్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ‘సీజన్ ఇంకా మొదలవ్వనే లేదు. కానీ రైనా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ సీజన్ లో ఆడకపోతే అతడు పెద్ద మొత్తంలో (రూ.11 కోట్లు) డబ్బును కోల్పోనున్నాడు‘ అని శ్రీనివాసన్ చెప్పడం దీనికి ఊతమిస్తోంది. పర్సనల్ రీజన్స్ పేరుతో రైనా ఇండియాకు తిరిగి వెళ్లగా.. టీమ్ లోని ఇద్దరు క్రికెటర్స్ కరోనా పాజిటివ్ గా తేలారు. దీంతో ఈ విషయంలో శ్రీనివాసన్ సీరియస్ అయ్యారని తెలిసింది.

‘నా ఆలోచన ఏంటంటే మీరు సంతోషంగా లేకున్నా, అయిష్టతతో ఉన్నా వెనక్కి వెళ్లిపోవచ్చు. నేను ఎవర్నీ కావాలని ఫలానా పని చేయాల్సిందిగా బలవంతం చేయను. కొన్నిసార్లు విజయాలు తలకెక్కుతాయి. నాకైతే మంచి కెప్టెన్ దొరికాడు. అతడు దేనికీ భయపడడు. అందరు ఆటగాళ్లతో మాట్లాడి నమ్మకం కలిగిస్తున్నాడు’ అని శ్రీనివాసన్ పేర్కొన్నారు. దీన్ని బట్టి రైనా అయిష్టతతోనే వెళ్లిపోయాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రైనాకు రీప్లేస్ మెంట్ గా మరో ప్లేయర్ కోసం సీఎస్కే అఫీషియల్ గా అడగలేదని తెలుస్తోంది. రైనా వెళ్లిపోయాడు కనుక వచ్చే ఏడాది వేలంలో అతణ్ని అందుబాటులో ఉంచుతారని, కానీ సీఎస్కేకు బదులుగా మరొకరు అతణ్ని దక్కించుకుంటారని వినిపిస్తోంది. చెన్నై చిన్న తలగా పిల్చుకునే రైనా మళ్లీ ఎల్లో జెర్సీలో కనిపించే అవకాశాలు చాలా స్వల్పమని తెలుస్తోంది.