10.58 లక్షల మంది తొలిసారిగా ఈపీఎఫ్‌వో పరిధిలోకి

10.58 లక్షల మంది తొలిసారిగా ఈపీఎఫ్‌వో పరిధిలోకి

న్యూఢిల్లీ:  రిటైర్‌మెంట్ ఫండ్ సంస్థ  ఎంప్లాయీస్​ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ఈ ఏడాది​​జులైలో కొత్తగా 18.23 లక్షల మంది చేరారు.  ఇది క్రితం సంవత్సరం జులైతో పోలిస్తే 24.48 శాతం పెరిగింది.   తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం జులైలో   చేరినవారిలో 10.58 లక్షల మంది తొలిసారిగా ఈపీఎఫ్‌వో సోషల్​ సెక్యూరిటీ పరిధిలోకి వచ్చారని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి కొత్త సభ్యుల సంఖ్య పెరుగుతున్నది. కొత్తగా చేరిన 10.58 లక్షల మందిలో దాదాపు 57.69 శాతం మంది 18-–25 ఏళ్ల మధ్య వయస్కులే!  దీనిని బట్టిచూస్తే సంఘటిత రంగ ఉద్యోగాల్లో ఎక్కువ యువతకు వెళ్తున్నాయని ఎనలిస్టులు అంటున్నారు. ఇదే నెలలో ఈపీఎఫ్​ఓ నుంచి దాదాపు 4.07 లక్షల మంది వెళ్లిపోగా, 11.72 లక్షల మంది తిరిగి చేరారు.  

వీళ్లు ఫండ్ ​ట్రాన్స్​ఫర్​ ద్వారా తమ సభ్యత్వాన్ని కొనసాగిస్తున్నారు. వేగంగా సేవలు అందించడానికి  ఈపీఎఫ్​ఓ  తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. జులైలో చేరిన మహిళల సంఖ్య 4.06 లక్షలు. పోయిన జులై తో పోలిస్తే ఇది 34.84 శాతం పెరిగింది. నెలలో ఈపీఎఫ్​ఓలో చేరిన మొత్తం కొత్త సభ్యులలో  మహిళా ఉద్యోగుల సంఖ్య 27.54 శాతంగా నమోదైంది. గత 12 నెలల్లో ఇదే అత్యధికం. ఈపీఎఫ్​ఓలో మహిళా భాగస్వామ్యం పెరుగుతోందని కార్మికశాఖ తెలిపింది. నెలవారీగా లెక్కలను పరిశీలిస్తే తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ & మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్నాయి.

మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్  ఢిల్లీ రాష్ట్రాల నుంచి జులై నెలలో దాదాపు 12.46 లక్షల మంది ఈపీఎఫ్​ఓలో చేరారు. జులై రిజిస్ట్రేషన్లలో..రెండు కేటగిరీలు అంటే 'ఎక్స్​పర్ట్​ సర్వీసెస్​' (మాన్ పవర్ ఏజెన్సీలు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు,  చిన్న కాంట్రాక్టర్లు మొదలైనవి)  'ట్రేడింగ్–కమర్షియల్​ ఎస్టాబ్లిష్​మెంట్ల' వాటా 46.20 శాతం ఉంది. 'స్కూల్స్​', 'బిల్డింగ్ & కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ', 'ఫైనాన్సింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్' మొదలైన పరిశ్రమల నుంచి కూడా రిజిస్ట్రేషన్లు బాగున్నాయి.