మొదలైన చార్జింగ్ స్టేషన్ల నిర్మాణాలు

మొదలైన చార్జింగ్ స్టేషన్ల నిర్మాణాలు
  • ఇక దేశమంతటా ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు
  • ఈవీ ఇన్ ఫ్రా ప్లాన్లను రెడీ చేస్తున్న సీపీఎస్ఈలు
  • రంగంలోకి రిలయన్స్ కూడా
  • బీపీతో కలిసి జాయింట్ వెంచర్
  • హెచ్ పీతో టాటా ఒప్పందం
  • ఎన్టీపీసీ నుంచి కూడా ఈవీ చార్జర్లు

న్యూఢిల్లీ: కరెంటు బండ్లకు గిరాకీ పెరుగుతుండటంతో ఈవీ ఇన్​ఫ్రా సెక్టార్‌‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్సీలు),  ప్రైవేట్ కంపెనీలు ఏర్పాట్లను స్పీడప్ చేశాయి. దేశమంతటా ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ స్టేషన్ల నిర్మాణాలను మొదలుపెట్టాయి. ఈవీ ఇన్​ఫ్రా పెరగడం వల్ల దేశమంతటా కరెంటు బండ్ల కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేయడం,  పెట్రో ప్రొడక్టుల వాడకాన్ని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఈవీలను ఎంకరేజ్ చేస్తోంది. అందుకే ప్రభుత్వరంగ ఇంధన సంస్థలు ఐఓసీఎల్, హెచ్‌‌పీసీఎల్,ఎన్టీపీసీతోపాటు  టాటా పవర్  రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రైవేట్ సంస్థలూ ఈవీ ఇన్‌‌ఫ్రా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ వచ్చే మూడేళ్లలో ఐదు వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తాయి. రాబోయే మూడేళ్లలో 10 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఐఓసీ ఇటీవల ప్రకటించింది. తాము కూడా మూడేళ్లలో ఐదు వేల చార్జింగ్ స్టేషన్లను నిర్మిస్తామని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌‌పీసీఎల్) తాజాగా ప్రకటించింది. ఈ విషయమై బ్లూమ్‌‌బర్గ్ న్యూ ఎనర్జీ ఫైనాన్స్ (బీఎన్ఈఎఫ్) ఎగ్జిక్యూటివ్ ఒకరు మాట్లాడుతూ చాలా మంది రిటైలర్లు ఇప్పటికే ఉన్న తమ అవుట్‌‌లెట్లలో ప్రైవేట్ కంపెనీలకు స్థలాలను ఇచ్చి చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయిస్తున్నారని పేర్కొన్నారు. 

పలు కంపెనీలతో చేతులు కలిపిన ఐఓసీ
దేశవ్యాప్తంగా ఐఓసీకి 448  చార్జింగ్ స్టేషన్లు,  30 బ్యాటరీ మార్పిడి స్టేషన్లు ఉన్నాయి. ఈవీ చార్జర్లను ఏర్పాటు చేయడానికి టాటా పవర్, ఎన్టీపీసీ, ఫోర్టమ్, హ్యుందాయ్, టెక్ మహీంద్రా, భెల్, ఓలా వంటి అనేక సంస్థలతో కలిసి పనిచేశామని ఈ కంపెనీ తెలిపింది.  హెచ్‌‌పీసీఎల్ తన పెట్రోల్ పంపుల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి టాటా పవర్‌‌తో  ఒప్పందం కుదుర్చుకుంది. టాటా పవర్ ప్రస్తుతం 878 పబ్లిక్ ఈవీ చార్జింగ్ పాయింట్లను నడుపుతోంది. 2025  ఆర్థిక సంవత్సరం చివరి నాటికి లక్ష కంటే ఎక్కువ చార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కంపెనీ హోమ్ చార్జింగ్, పబ్లిక్ చార్జింగ్,  ఫ్లీట్ చార్జింగ్ సేవలను అందిస్తోంది. ఇండియాలోనే టాప్ ఈవీ చార్జింగ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా ఎదగాలని  రిలయన్స్ ఇండస్ట్రీస్ భావిస్తోంది. ఈ కంపెనీ ఇటీవల బ్రిటిష్ పెట్రోలియంతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాట్లు చేసింది. జియో–బీపీ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు,  బ్యాటరీల నెట్‌‌వర్క్‌‌ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా 400 ఈవీ చార్జర్లను ఏర్పాటు చేస్తామని మరో సీపీఎస్​ఈ ఎన్టీపీసీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి, ఎన్టీపీసీ 142 ఈవీ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెస్తుంది. దీని అనుబంధ సంస్థ ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్‌‌ఎల్ (ఎన్వీవీఎన్) ‘ఫేమ్‌‌’ పథకం కింద ఎనిమిది నగరాల్లో 204 ఈవీ చార్జింగ్ స్టేషన్లను నిర్మించనుంది. తమ రాష్ట్రంలోని హైవేలపై ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఎన్వీవీఎన్ మహారాష్ట్రతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. హైదరాబాద్​ కంపెనీ విశాకగ్రూపుకు చెందిన ఆటమ్​ కూడా దేశమంతటా సోలార్​ పవర్​ చార్జింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది.

భారీగా పెరగనున్న ఈవీలు
యూబీఎస్ ఎనలిస్టుల అంచనాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం టూవీలర్ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ టూవీలర్ల వాటా దాదాపు 10 శాతం ఉంటుంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి త్రీ-వీలర్ అమ్మకాల్లో 43శాతం ఎలక్ట్రిక్ వేరియంట్లు ఉంటాయి.   టాటా పవర్ స్టడీ ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం నాటికి 14.3 మిలియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రోడ్లపైకి రానున్నాయి. 2030 నాటికి కనీసం 30శాతం కొత్త వెహికల్స్ అమ్మకాలు ఎలక్ట్రిక్‌‌వి ఉంటాయని అంచనా. ఫాస్టర్ అడాప్షన్ అండ్‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌ ఆఫ్ హైబ్రిడ్‌‌ అండ్‌‌ ఎలక్ట్రికల్ వెహికల్‌‌ (ఫేమ్) పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల ఈవీలు పెరుగుతాయని నీతి ఆయోగ్ చెబుతోంది. ఈవీలు కొన్న వారికి కేంద్రం ఫేమ్‌‌ ద్వారా రాయితీలు ఇస్తోంది. పలు రాష్ట్రాలు రిజిస్ట్రేషన్‌‌ ఫీజులను మాఫీ చేయడంతోపాటు అదనంగా రాయితీలనూ ఇస్తున్నాయి.