జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పార్టీలో ఫిరాయింపుల పరంపరం కొనసాగుతోంది. గులాం నబీ ఆజాద్ బాటలో మరికొంత మంది హస్తంకు హ్యాండ్ ఇస్తున్నారు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ పీర్జాడ మహ్మద్ సయ్యద్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా మంగళవారం 64 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ అసమ్మతి నేతలు తమ ఉమ్మడి రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. రాజీనామా చేసిన వారిలో జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్, అబ్దుల్ మజీద్ వానీ, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ ఉన్నారు.
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్కు గత శుక్రవారం రాజీనామా చేశారు. తాను కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. గాంధేయుల కుటుంబ వల్లనే రాహుల్ గాంధీ వల్లే కాంగ్రెస్ నాశనమైందని.. ఆయన లీడర్గా సెట్కారని విమర్శించారు. జీ23 నేతలతో కలిసి తాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేఖ రాసిన తర్వాత.. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపానన్నారు. కానీ తాను ఎప్పుడూ కూడా పార్టీకి రాజీనామా చేయాలని భావించలేదన్నారు. తన ఇంట్లో నుంచి తననే బలవంతంగా వెళ్లిపోయే పరిస్థితులను సృష్టించారని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు గులాం నబీ ఆజాద్ సెప్టెంబర్ 4న బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే. ఈ సభ జమ్ములోని సైనిక్ కాలనీలో జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆ బహిరంగసభలోనే ఆజాద్ తాను పెట్టబోయే నూతన పార్టీ పేరును ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నది.
