చమురు,బొగ్గు, గ్యాస్ ను వెలికితీస్తే భూమి పైకి వేడి

చమురు,బొగ్గు, గ్యాస్ ను వెలికితీస్తే భూమి పైకి వేడి

ఒక్క కార్బన్​ డయాక్సైడ్​ వల్లే భూమి వేడెక్కుతుందనడం కరెక్ట్​ కాదని ఆధునిక పర్యావరణ పితామహుడిగా పిలిచే ప్రముఖ పర్యావరణవేత్త హ్యూబర్ట్​ ల్యాంబ్​ అప్పుడెప్పుడో చెప్పారు. ఆ ఎమిషన్స్​ వల్ల వచ్చే వేడి దానికి అసలు కారణమన్నారు. అదే కాకుండా అణు పరీక్షలు, అగ్నిపర్వత పేలుళ్లూ వేడిని బయటకు వదలడం వల్ల భూమి మండుతుందని అప్పట్లోనే వివరించారు. 2009లో ఇద్దరు స్వీడన్​ సైంటిస్టులూ ఆయన మాటలకే మద్దతు తెలిపారు. రెండేళ్ల తర్వాత మరో ఇద్దరు చైనా సైంటిస్టులూ విపరీతమైన వేడి, వాతావరణ మార్పులకు కారణమవుతుందని వివరించారు. అది కూడా భూమి లోపల నుంచే విడుదలవుతుందని చెప్పారు. బొగ్గు, చమురు, గ్యాస్​ వంటివి భూమి లోపల కొన్ని పొరల్లో పరుచుకుని ఉన్నాయని, అవన్నీ కూడా వేడిని పట్టి ఉంచుతాయని వివరించారు. అయితే, ఆ వనరులన్నింటినీ తోడి తీసేయడం వల్ల వాతావరణంలోకి అందులో ట్రాప్​ అయిన వేడి కూడా విడుదలవుతోందని, ఫలితంగా భూమి వేడెక్కుతోందని చెప్పారు. ఆ వివరాల ఆధారంగానే యూనివర్సిటీ ఆఫ్​ లీడ్స్​, యూనివర్సిటీ ఆఫ్​ సర్రే సైంటిస్టులు చమురు, బొగ్గు, గ్యాస్​ నిక్షేపాల వెలికితీత వల్ల టెంపరేచర్లు ఎట్లా ప్రభావితమయ్యాయో పరిశోధన చేశారు. వాటిని తీసిన ప్రాంతాల్లో వేడి బాగా పెరిగిందని గుర్తించారు.

ఆర్కిటిక్​లో ఎక్కువ.. అంటార్కిటికాలో తక్కువ

2007 నుంచి 2017 మధ్య 4,550 కోట్ల టన్నుల ఆయిల్​, 3,630 కోట్ల క్యూబిక్​ మీటర్ల గ్యాస్​ను భూమి లోపలి నుంచి ప్రపంచ దేశాలు వెలికితీశాయి. ఆ వెలికితీతలో మిగులు వ్యర్థాలన్నీ సముద్రం, భూమిపై పరుచుకుపోయాయి. దీంతో భూమిలోపల ఉన్న వేడంతా నేల, నీళ్ల మీదకు వచ్చేసింది. సముద్రాలు, భూమి వేడెక్కాయి. ప్రపంచం సగటు భూమి వేడితో పోలిస్తే చమురును వెలికితీసే సౌదీ అరేబియా, అరేబియన్​ గల్ఫ్​, గల్ఫ్​ ఆఫ్​ మెక్సికో, నార్త్​ సీ, అలస్కా వంటి ప్రాంతాల్లో 3 నుంచి 6 రెట్లు ఎక్కువగా వేడి నమోదైనట్టు తేల్చారు. ఎక్కువగా ఆర్కిటిక్​ ప్రాంతంలోనే ఉష్ణోగ్రతలు పెరిగినట్టు గుర్తించారు. 1978 నుంచి ప్రతి పదేళ్లకోసారి 0.6 డిగ్రీల టెంపరేచర్​ పెరిగినట్టు తేల్చారు. అంటార్కిటికాలో మాత్రం 0.1 డిగ్రీలు ఎక్కువైనట్టు గుర్తించారు. ఆ రెండు ధ్రువాల వద్ద కార్బన్​ డయాక్సైడ్​ స్థాయిలు తక్కువగానే ఉన్నా, ఆర్కిటిక్​లో ఇంధన వనరులను తోడడం వల్లే టెంపరేచర్లు పెరిగినట్టు చెప్పారు. అంటార్కిటికాలో లేదు కాబట్టే వేడి అంతగా పెరగలేదన్నారు. 2007 నుంచి ఆర్కిటిక్​లోని 400కు పైగా ప్రాంతాల్లో చమురు, గ్యాస్​ నిక్షేపాలను వెలికితీస్తున్నారు. అంటార్కిటికాలో మాత్రం నిషేధం విధించారు.

భూమిలోని హీట్​ షీల్డ్​ పోవడం వల్లే

ఈ పరిస్థితులకు కారణం సహజ వనరులను తోడడం వల్ల భూమి లోపల ఉండే హీట్​ షీల్డ్​లు పోవడమేనని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ హీట్​ షీల్డ్​లను కాపాడుకుంటే భూమి లోపల ఉన్న వేడి భూమిపైకి రాదని చెబుతున్నారు. అతినీలలోహిత కిరణాల నుంచి భూమిని ఓజోన్​ పొర కాపాడినట్టే, భూమి లోపల కూడా వేడి బయటకు రాకుండా ఆ హీట్​షీల్డ్​లే కాపాడతాయని అంటున్నారు. కాబట్టి వాటిని పటిష్టం చేసి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందంటున్నారు.

ఇంగ్లాండ్​ పరిస్థితీ అదే

ఈశాన్య ఇంగ్లాండ్​లో బొగ్గు తవ్వకాలు ఎక్కువ. దాని వల్ల అక్కడ భూ ఉపరితలం రూపు రేఖలే మారిపోయాయి. ముఖ్యంగా గేట్స్​హెడ్​, న్యూకాజిల్​లోని బొగ్గు గనుల వద్ద భూమి లోపలి నుంచి వేడి బయటకు పొక్కింది. దాంతో వాటి చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే ఆ రెండు ప్రాంతాల్లో 2 డిగ్రీల వేడి ఎక్కువగా నమోదైంది. గేట్స్​హెడ్​ వద్దైతే అది 4.5 డిగ్రీలు. అంతేకాదు, ఆ బొగ్గు గనిలోని వాటర్​ పంపింగ్​ స్టేషన్​ వద్ద నీళ్లు కూడా బాగా వేడెక్కినట్టు తేలింది. వాటి మీద రీసెర్చ్​ చేశారు కాబట్టి ఈ విషయం తేలింది. అదే ప్రభావం మిగతా గనులపైనా ఉంటుందన్నది సైంటిస్టులు చెబుతున్న మాట.