సర్ప దోషమని చెప్పి రూ. 37 లక్షలకు టోకరా

సర్ప దోషమని చెప్పి రూ. 37 లక్షలకు టోకరా
  • ఏడుగురిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
  • నిందితులంతా రాజస్థాన్​కు చెందినవాళ్లుగా గుర్తింపు

హైదరాబాద్‌ : దోష నివారణకు పూజలు చేస్తామని చెప్పి ఓ వ్యాపారి నుంచి అందినకాడికి దోచుకున్న దొంగ బాబాల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్​కు చెందిన ఈ గ్యాంగ్​లో ఏడుగురిని అరెస్ట్ చేశామని, మరో నలుగురి కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితుల నుంచి రూ.8.3 లక్షల నగదు, 12 సెల్‌‌ఫోన్లు, క్యాష్  కౌంటింగ్ మెషీన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్యాంగ్‌‌ దోపిడీ చేసిన తీరును రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.

సాధువుల వేషంలో అడుక్కునేందుకు వచ్చి.
యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణపురానికి చెందిన కొండల్‌‌రెడ్డి.. వ్యవసాయంతో పాటు ఎక్స్‌‌ప్లోజివ్‌‌, ట్రాన్స్‌‌పోర్ట్‌‌ వ్యాపారం చేస్తున్నాడు. 2020 నవంబర్‌‌‌‌ 29న పొలం దగ్గరి నుంచి వస్తుండగా ఓ పాము తన బైక్‌‌ ముందుకు రావడంతో భయపడి కిందపడిపోయాడు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. అదే సమయంలో వ్యాపారంలో నష్టం, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఆపై వారం తర్వాత రాజస్థాన్​లోని సిహోరీ జిల్లాకు చెందిన సంజునాథ్‌‌, ఘోరక్‌‌నాథ్‌‌ సాదువుల వేషంలో కొండల్‌‌రావు ఆఫీస్‌‌కి వచ్చారు. భిక్షాటనకు వచ్చామని చెప్పిన ఆ ఇద్దరు.. కొండల్​కు గాయాలను చూసి ఆరా తీశారు. సర్పదోషముందని భయపెట్టారు. నివారించేందుకు గురువులను పిలిపించి రూ.41 వేల ఖర్చుతో  తాము పూజలు చేస్తామని నమ్మించడంతో కొండల్ రెడ్డి అంగీకరించాడు. దీంతో ఆ ఇద్దరు మరో నలుగురు రామ్‌‌నాథ్‌‌(40),జొన్నత్‌‌(33), గోవింద్‌‌నాథ్‌‌(28), అర్జున్‌‌నాథ్‌‌(22)తో కలిసి కొండల్ రెడ్డి ఇంట్లో పూజలు చేశారు. అలా దశలవారీగా పూజల పేరిట 2022 ఫిబ్రవరి దాకా రూ.37.71 లక్షలు కొండల్ నుంచి వసూలు చేశారు. తాను మోసపోతున్నానని తేరుకున్న కొండల్​రెడ్డి భువనగిరి పోలీసులను ఆశ్రయించడంతో వాళ్లు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.  స్పెషల్‌‌ టీమ్‌‌తో కలిసి పూజలకు రమ్మని దొంగబాబాలను ఘట్​కేసర్​కు పిలిపించారు. రామ్‌‌నాథ్‌‌, జన్నత్‌‌, గోవింద్‌‌నాథ్‌‌, అర్జున్‌‌నాథ్‌‌, హవాలా ఏజెంట్లు పునరమ్‌‌(37), వస్నరామ్‌‌(22), ప్రకాశ్ జోట(27)ను సోమవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న  సంజునాథ్‌‌, గోరక్‌‌నాథ్‌‌, ప్రకాశ్ ప్రజాపతి, రమేశ్ ప్రజాపతి కోసం గాలిస్తున్నారు.