బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్

బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్

ఐటీ జాబ్ అంటే అందరికీ కలల ఉద్యోగం. లక్షల్లో జీతం.. వారంలో రెండు సెలవు దినాలు.. పైగా చల్లగా ఏసీ కింద కూర్చొని పనిచేసే వెసులుబాటు.. చుట్టూ ఆకర్షణీయంగా కనిపించే ఉద్యోగులు.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు సాఫ్ట్‌వేర్ రంగాన్ని ఎవరు ఎంచుకోరు చెప్పండి. కాకపోతే, ఇప్పుడు ఆ రంగంలో అలజడి రేగింది. ఏరోజు ఎవరి ఉద్యోగం ఊడుతోందో తెలియని పరిస్థితి. ఉద్యోగం పోతే జీవితాన్ని ఎలా నెట్టుకురావాలి..? కుటుంబ పోషణ ఎలా..? అంటూ ఐటీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

2022, 2023లో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు 425,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించగా.. ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. 2024 మొదటి నాలుగు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 279 సంస్థల్లో 80,000 మంది టెక్ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజా జాబ్ కట్‌లో, US కస్టమర్ అనుభవ నిర్వహణ ప్లాట్‌ఫారమ్ స్ప్రింక్లర్ దాదాపు 116 మంది ఉద్యోగులను తొలగించింది. అలాగే, ఫిట్‌నెస్ సంస్థ పెలోటన్ ఈ వారం తన వర్క్‌ఫోర్స్‌లో 15 శాతం మందిని (సుమారు 400 మంది ఉద్యోగులు) తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఛార్జింగ్ టీమ్‌ను రద్దు చేసిన మస్క్

టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్ మొత్తం టెస్లా ఛార్జింగ్ టీమ్‌నే రద్దు చేశాడు. టెస్లా తన ప్రపంచ శ్రామిక శక్తి నుండి 10 శాతం (లేదా 14,000 మంది) తగ్గించిన వారాల తర్వాత వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. అలాగే, పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా గూగుల్ దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు వస్తున్నాయి. ఇలాంటి సమయాన గతవారం భారతదేశంలో వాహన రైడింగ్ ఫ్లాట్ ఫామ్ ఓలా క్యాబ్స్ దాని శ్రామికశక్తిలో కనీసం 10 శాతం మందిపై ప్రభావం చూపే పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించింది. ఇలా అన్ని రంగాల సంస్థలు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను పీకేస్తూ నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ ఏరివేతకు ఎప్పుడు ముగింపు పడుతుందో తెలియని పరిస్థితి. ఐటీ ఉద్యోగాన్వేషణలో ఉన్నవారు ఇతర రంగాల వైపు ద్రుష్టి సారించడం ఉత్తమం.