CSK: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ పేసర్

CSK: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ పేసర్

ప్లేఆఫ్స్‌ సమీపిస్తున్న వేళ చెన్నై సూపెర్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగలింది. వారి ప్రథమ ఆయుధం, యువ పేసర్‌ మతీష పతిరణ(Matheesha Pathirana) స్వదేశానికి వెళ్ళిపోయాడు. తొడ కండరాలు పట్టేయడంతో నాలుగు రోజుల కిందట పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైన పతిరణ.. రెండ్రోజుల కిందట వీసా పనుల నిమిత్తం శ్రీలంకకు వెళ్లి వచ్చాడు. అనంతరం ఆదివారం(మే 03) పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. గాయం తిరగబెట్టడంతో అతను స్వదేశానికి పయనమైనట్లు చెన్నై యాజమాన్యం వెల్లడించింది. 

పతిరణ స్నాయువు గాయంతో బాధపడుతున్నారని, కోలుకోవడానికి సమయం పడుతుండడంతో తన స్వదేశమైన శ్రీలంకకు తిరిగి వెళతారని చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటన విడుదల చేసింది. అయితే, గాయం నుంచి కోలుకున్నాక అతను తిరిగి వస్తాడా? లేదా? అనేది మాత్రం తెలియజేయలేదు. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పతిరణ తిరిగిరావడం అసంభవమే.

కీలక సమయాల్లో వికెట్లు తీయాలన్నా.. డెత్‌ ఓవర్లలో విలువైన పరుగులు నియంత్రించాలన్నా.. చెన్నై జట్టుకు పతిరణ ప్రథమ ఆయుధం. అలాంటిది అతని సేవలను కోల్పోవడం వారికి భారీ లోటు. 6 మ్యాచుల్లో 13 వికెట్లు తీసిన లంక సెన్సేషన్.. ఈ సీజన్ లో లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు.