విశ్లేషణ: ఉరి ఎవరికి పడుతుంది?

విశ్లేషణ: ఉరి ఎవరికి పడుతుంది?

ఇయ్యాల రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా పాలసీలను రూపొందిస్తోంది. ప్రజలందరికీ సంబంధించిన అంశాలైనాసరే ఎవరినీ సంప్రదించట్లేదు. ఎవరి అభిప్రాయాలను సేకరించే ప్రయత్నం చేయడం లేదు. వ్యవసాయం, రైతుల విషయానికే వస్తే పంటల మార్పిడి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇప్పటికిప్పుడు పంటలు మార్చమని రైతులను శాసించడం అన్యాయం. ఇది అప్రజాస్వామిక ధోరణి. తగిన పరిశోధన చేసి, మెరుగైన విత్తనాలను తెచ్చి, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి, మద్దతు ధర ప్రకటించి, ప్రభుత్వమే కొనుగోలు చేస్తేనే పంటల మార్పిడి సాధ్యమవుతుంది. కానీ ఆ బాధ్యతను వదిలేసి ‘‘వరి మానక పోతే ఉరి వేసుకొనే పరిస్థితి’’ వస్తుందని రాష్ట్ర ప్రభుత్వమే బెదిరించడాన్ని ఏమనుకోవాలి. ప్రజాస్వామ్యంలో అట్లాంటి పద్ధతి మంచిదికాదు. ప్రజాస్వామిక పద్ధతుల్లోనే పాలన సాగాలి. పంటల మార్పిడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలి. ఇట్లనే వ్యవహరిస్తే పాలనకే ఉరి వేసే పరిస్థితి రావచ్చు.

వేసంగిలో వరి పంట వేస్తే ఉరి వేసుకొనే పరిస్థితి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన తర్వాత పంటల సాగు విషయమై పెద్ద దుమారమే రేగింది. అందుకు రెండు కారణాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో తెచ్చిన మార్పుల వల్లనే పంటల మార్పిడి అవసరమవుతున్నదన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఒక వివాదానికి తెర లేపింది. వరి బదులుగా వేరే ఏదైనా పంట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తేవడం చర్చలో రెండవ అంశం. ఈ చర్చలోకి వెళ్లే ముందు తెలంగాణ వ్యవసాయానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలను తెలుసుకోవాలి.

వరి ప్రధాన పంటగా మారింది

తెలంగాణలో సంప్రదాయకంగా వరి ప్రధానమైన పంట కాదు. 1980 దశకం తర్వాత తెలంగాణ వ్యవసాయంలో అప్పటి వరకు ప్రధాన పాత్ర పోషించిన పునాస పంటలు దాదాపుగా మాయమై పోయాయి. ఆ తర్వాత వరి సాగు విస్తీర్ణం క్రమంగా పెరిగింది. పప్పు ధాన్యాలు, మక్క, జొన్న, నూనె గింజలు వంటి పంటలను వర్షాధారంగా పండించే వారు. ప్రతి రైతు కనీసంగా 10-–15 రకాల పంటలు పండించే వాడు. అటు తర్వాత పత్తి, మక్క, చెరుకు, వరి, మిర్చి, సోయా వంటి పంటలు ప్రాముఖ్యతను పొందాయి. వీటన్నింటిలోనూ రైతులకు వరి, పత్తి పంటల పట్ల ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. అందుకే ఈ రెండు పంటలు బాగా విస్తరించి చివరికి తెలంగాణ ఏర్పడిన నాటికి దాదాపు 80 శాతం సాగు భూమిని ఆక్రమించాయి.

పదేండ్లుగా పెరిగిన సాగు

గత పది సంవత్సరాలుగా వరి బాగా విస్తరిస్తున్నదని రైతులు చెబుతున్నారు. పోయిన నాలుగేండ్లలో వరి పంట ఇదివరకెన్నడూ లేని రీతిలో పెరిగిపోయింది. ఈ విషయాన్ని అధికారిక లెక్కలు కూడా ధ్రువీకరిస్తున్నాయి. 2004-–05 నుంచి 2013-–14 మధ్య కాలంలో సగటున ఏడాదికి 37.47 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. 2013-–14 తర్వాత 2020-–21 వరకు సగటు సాగు 55.28 లక్షల ఎకరాలు. కానీ అదనంగా ఇంకొక విషయం చెప్పుకోవాల్సి ఉంది. 2018-–19 లో వరి సాగు 47.74 లక్షల ఎకరాలైతే 2019–20లో అది 80.50 లక్షల ఎకరాలకు పెరిగింది. 2020-–21 సంవత్సరంలో వరి సాగు మరింత పెరిగింది. ఆ ఏడు రికార్డు స్థాయిలో 104.23 లక్షల ఎకరాలలో రైతులు వరి పంట వేశారు. మంచి వర్షాలు కురిసి సాగు నీటి వసతి పెరగటం, ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు బాధ్యత తీసుకోవడం వంటి అంశాలు వరి విస్తీర్ణం పెరగడానికి ముఖ్య కారణాలుగా రైతులు చెబుతున్నారు. గతంలో పూర్వపు వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో వ్యవసాయ పరిస్థితులపై సర్వే చేసినప్పుడు వరి పంటను రిస్కు లేని పంటగా రైతులు చెప్పారు. సాగు సులభం. ఎక్కువ లేబర్ అవసరం లేదు. పండిన పంటను ప్రభుత్వమే కొంటున్నది కాబట్టి వరి సాగుకు రైతులు సుముఖంగా ఉన్నారు. ప్రస్తుతం 50 శాతం నుంచి కొన్ని గ్రామాల్లో 90 శాతం దాకా వరి మాత్రమే సాగవుతున్నదంటే ఈ పంట రైతులకు ఎంత అనుకూలమైనదో తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌‌‌‌ అధికారంలోకి వచ్చాక..

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరుకు, మక్క, జొన్న, పప్పు ధాన్యాలకు మార్కెట్ లేకుండా చేసింది. నిజాం కాలం నాటి చెక్కర ఫ్యాక్టరీలను మూసివేసిన తర్వాత చెరుకు సాగు పడిపోయింది. మక్క తక్కువ ధరకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తోంది. మక్క పంటకు మార్కెట్ లేదని, ఆ పంటను పండించ వద్దని హెచ్చరికలు జారీ చేయడంతో ఆ పంట విస్తీర్ణం తగ్గింది. కంది పంట కొనుగోలు విషయంలో రకరకాల షరతులు విధించి రైతులను సర్కారు ఇబ్బందుల పాలు చేసింది. ఫలితంగా చాలా మంది రైతులు పప్పు దినుసులు వేయడం లేదు. కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలు లేవు. కూరగాయలు, పండ్ల ఎగుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. బత్తాయి, నిమ్మ రైతులు పంటను అమ్ముకోవడానికి పడుతున్న ఇబ్బందులు అందరికీ తెలుసు. ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతూ దొరుక్కపోవడంతో రైతులు ఉద్యాన పంటలను చాలించుకుంటున్నారు. చేజేతులా ఏ పంటలను వద్దని, మార్కెట్​ను విధ్వంసం చేసిందో ఆ పంటలనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వేయమంటోంది. ఈ అనుభవాల రీత్యా కొంటానని హామీ ఇస్తే తప్ప ఏ పంట వేయబోమని రైతులు అంటున్నారు.

తన బాధ్యతను సర్కారు నిర్వర్తించాలె

పంటల కూర్పును నిర్ధారించడంలో రాష్ట్ర ప్రభుత్వానిది ప్రధాన పాత్ర. 1960 దశకం నుంచి పంటల ఎంపికలో, విత్తనాలు, ఎరువులు అందజేయడంలో, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌‌‌‌లో సర్కారు పాత్ర బాగా పెరిగింది. ఈ పాత్ర ఇప్పటికీ కొనసాగుతోంది. 1960 వరకు మన దేశ అవసరాలకు తగినంతగా దిగుబడి లేదు. దేశీయ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం అమెరికా నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకునేది. దేశ బలహీనతను గుర్తించి అమెరికా తన విధానాలను మనదేశంపై రుద్దబోయింది. ఆహార ధాన్యాల స్వయం సమృద్ధిని సాధించకుండా దేశ సార్వభౌమాధికారానికి రక్షణ లేదని అప్పటి ప్రభుత్వం గుర్తించి హరిత విప్లవానికి పూనుకున్నది. ఈ మార్పును సాధించడానికే ఎఫ్​సీఐని ఏర్పాటు చేసింది. వ్యవసాయ ఖర్చుల, ధరల నిర్ణాయక కమిటీని వేసింది. ప్రయత్నం మంచిదే, కానీ ప్రభుత్వం మద్దతు ధరను అన్ని పంటలకూ ఇవ్వడం లేదు. 23 పంటలకే మద్దతు ధర ప్రకటించినా ప్రభుత్వం వడ్లను, గోధుమలను మాత్రమే సేకరిస్తున్నది. అందువల్ల దేశవ్యాప్తంగా ఈ రెండు పంటల కింద సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఆ విధంగా ప్రభుత్వ పాత్ర వ్యవసాయ రంగంలో విస్తరించింది. ప్రభుత్వ విధానాల ఫలితంగానే వ్యవసాయ రంగం ఇప్పుడున్న రూపాన్ని సంతరించుకుంది. బాధ్యతగా ప్రభుత్వం తన వ్యవహరించకపోతే అనేక అనర్థాలు తలెత్తుతాయి. ఇప్పుడు అధికార దుర్వినియోగం వల్లనే ఒక ఉపద్రవం తలెత్తింది.

వరికి ప్రత్యామ్నాయం ఏది

ఇప్పుడు ఎకాఎకిన వరి వద్దంటే పంట మార్పిడి సాధ్యమవుతుందా? చాలా భూముల్లో వరి తప్ప ఇంకొక పంట సాధ్యం కాదు. ఎందుకంటే ఆ భూముల్లో వరి సాగు మాత్రమే సాధ్యం. నీటి తేమ ఎక్కువగా ఉండే, చౌడు భూములైతే వరి తప్ప ఇంకొక పంట పండదు. ఇంకొక పంట వేద్దామన్నా ఇప్పుడు కాలం దాటి పోయింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘‘యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగు: యాజమాన్యపు పద్ధతులు’’ అనే పుస్తకం చదివితే ఇప్పుడు నువ్వులు, మినుము, పెసర వేయవచ్చు. అయితే అందుకు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? అని రైతులు అడుగుతున్నారు. విత్తనాలు దొరికినా మార్కెట్ ఎట్లా? పంట ఎవరు కొంటారు? పంటల మార్పిడి కోసం ప్రచారం చేస్తున్న అధికారుల వద్ద ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. పరీక్షల ముందు సిలబస్ మార్చినట్టుంది ఉంది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం.

ఎం. కోదండరాం 

అధ్యక్షుడు, తెలంగాణ జన సమితి