కరెంట్ కోతలపై రైతుల ఆగ్రహం ..పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు

కరెంట్ కోతలపై రైతుల ఆగ్రహం ..పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు

నెట్​వర్క్, వెలుగు: కరెంట్  కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు పలుచోట్ల నిరసనలకు దిగారు. గురువారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సబ్​స్టేషన్ల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్, తదితర పార్టీలు మద్దతు ప్రకటించాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం హద్నూర్  సబ్ స్టేషన్  వద్ద అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ డీఈ, ఏఈలను ఘెరావ్  చేశారు. భారతీయ కిసాన్  సంఘ్  ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్  అంబేద్కర్  విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించారు.

మెదక్  జిల్లా నిజాంపేటలో కరెంట్​ కోతలకు నిరసనగా సబ్ స్టేషన్  ముందు ధర్నా చేస్తున్న రైతులకు బీఆర్ఎస్  జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మద్దతు ప్రకటించారు. నార్సింగిలో జరిగిన ఆందోళనలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి పాల్గొన్నారు. అప్రకటిత విద్యుత్  కోతలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా రాయపోల్ సబ్ స్టేషన్  వద్ద బీఆర్ఎస్  ఆధ్వర్యంలోధర్నా చేశారు. దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి సబ్ స్టేషన్  వద్ద వరి కొయ్యలతో రాస్తారోకో చేపట్టారు.

దీంతో సిద్దిపేట, రామాయంపేట ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి జిల్లా తుర్కపల్లి విద్యుత్  సబ్ స్టేషన్  ఎదుట బీఆర్ఎస్  రాష్ట్ర నాయకుడు కల్లూరి నామచంద్రారెడ్డి నాయకత్వంలో ఆందోళన చేశారు. బీఆర్ఎస్​ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కోహెడ అంబేద్కర్​ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్  గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. కరెంట్​ లేక వరి పంటలు కళ్ల ముందే ఎంతున్నాయని ఆగ్రహంతో మంథని–-కాటారం ప్రధాన రహదారిపై బైఠాయించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

జగిత్యాల జిల్లా కథలాపూర్  మండలం పోతారంలోని కోరుట్ల–-వేములవాడ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేయడంతో రాకపోకలు నిలిచి ఇబ్బంది పడ్డారు. విద్యుత్​ కోతలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా అందోల్​ మండలం మాసాన్​పల్లి గ్రామస్తులు బిల్​ కలెక్షన్​ కోసం గ్రామానికి వచ్చిన విద్యుత్  సిబ్బందిని గ్రామ పంచాయతీ ఆఫీస్​లో నిర్బంధించారు. జోగిపేట ఎస్సై గిరి శ్రీకాంత్  గ్రామానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి జేఎల్ఎం రాజు,  బిల్  కలెక్టర్లు కృష్ణదేవరాయ, చిన్నగారి  నాగరాజును విడిపించారు.