‘అండర్​-17’ మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నీపై అనిశ్చితి

‘అండర్​-17’ మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నీపై అనిశ్చితి

అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య ‘ఏఐఎఫ్ఎఫ్’ ను ఫిఫా రద్దు చేసింది. సంబంధం లేని(థర్డ్ పార్టీ) వ్యక్తుల జోక్యం ఉన్న కారణంతో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఫిఫా చట్టాలను ఉల్లంఘించడం సహా థర్డ్ పార్టీల ఇన్వాల్వ్ మెంట్ ఉన్నందున్న ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఫిఫా పేర్కొంది. ఈ సస్పెన్షన్ కారణంగా ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 30 తేదీల్లో ఇండియాలో జరగాల్సిన FIFA U-17 మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నీపై అనిశ్చితి నెలకొంది. భారత్‌ నుంచి టోర్నీని మరో దేశానికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టోర్నమెంట్‌ నిర్వహణకు సంబంధించిన తదుపరి చర్యలను అంచనా వేస్తున్నామని, అవసరమైతే కౌన్సిల్ బ్యూరోకు రిఫర్ చేస్తామని ఫిఫా తెలిపింది. ఈ మేరకు భారత క్రీడా మంత్రిత్వశాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ఇందుకు సంబంధించి సానుకూల ఫలితం వస్తుందనే ఆశాభావంతో ఉన్నామని ఫిఫా పాలకమండలి వెల్లడించింది. మరోవైపు భారత ఫుట్​బాలర్స్ అంతా ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని స్టార్‌ స్ట్రయికర్‌ సునీల్‌ ఛెత్రి సూచించాడు. ఈ విషయంపై ఆటగాళ్లు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పాడు.