దశాబ్దాలుగా టెర్రరిజంతో పోరాడుతున్నం - జై శంకర్

దశాబ్దాలుగా టెర్రరిజంతో పోరాడుతున్నం - జై శంకర్

టెర్రర్​ కష్టాల గురించి ఇండియాకే ఎక్కువ తెలుసు
ఆర్థిక సాయాన్ని అడ్డుకోవాలె రాజకీయాలకతీతంగా 
ఒక్కటై ఫైట్​ చేయాలె  విదేశాంగ మంత్రి జై శంకర్​ వెల్లడి


ముంబై : 26/11 ముంబై టెర్రర్ దాడుల కుట్రదారులను ఇంకా కాపాడుతూనే ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. టెర్రరిజం బాధ ఇతర దేశాల కన్నా ఇండియాకే ఎక్కువ తెలుసని ఆయన పేర్కొన్నారు. కొంతమంది టెర్రరిస్టులపై నిషేధం విధించే విషయంలో యూఎన్ భద్రతా మండలి వెనకడుగు వేస్తోందని, రాజకీయ ఒత్తిళ్లే ఇందుకు కారణమని పరోక్షంగా చైనాను ఉద్దేశించి ఆయన కామెంట్​ చేశారు. ‘టెర్రర్​ కార్యకలాపాలకు కొత్త టెక్నాలజీల వాడకాన్ని అడ్డుకోవడం’ పేరుతో శుక్రవారం ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్​లో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. 2008 నవంబరులో టెర్రరిస్టులు దాడిచేసిన ప్రాంతాల్లో తాజ్ హోటల్ ఒకటి. అప్పటి దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సందర్భంగా జైశంకర్ నివాళులర్పించి మాట్లాడారు. నిధులు లేకుంటే టెర్రర్​ సంస్థలు చేయగలిగేదేమీ ఉండదని చెప్పారు. నిధులు అందకుండా అడ్డుకోవడం ద్వారా టెర్రర్​ సంస్థలను కట్టడి చేయొచ్చని తెలిపారు. ‘‘దశాబ్దాలుగా క్రాస్​ బార్డర్​ టెర్రరిజంతో పోరాడుతున్నా ఇండియా బలహీనపడలేదు. టెర్రరిజాన్ని అంతం చేయాలన్న కోరికను విడనాడలేదు.

ఇండియాతో పాటు ప్రపంచంలో చాలా దేశాలకు టెర్రరిజం పాకింది. రాజకీయాలకు అతీతంగా దేశాలన్నీ కలిసి ఉమ్మడిగా పోరాడితేనే దీనిని అంతం చేయగలం. అన్నివిధాలా దృఢంగా పోరాడాలి. సందర్భం ఏదైనా, ఏ సమయంలోనైనా పోరాటం ఆపొద్దు. 26/11న జరిగిన దాడి ముంబైపై మాత్రమే కాదు, యావత్ అంతర్జాతీయ సమాజంపై జరిగిన అటాక్” అని జైశంకర్ అన్నారు. ఆరోజు టెర్రరిస్టులు సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడి మారణహోమం సృష్టించారని పరోక్షంగా పాకిస్తాన్ ను ఉద్దేశిస్తూ మంత్రి విమర్శించారు. ఆ దాడిలో 140 మంది భారతీయులు, 23 దేశాలకు చెందిన 26 మంది పౌరులు చనిపోయారని తెలిపారు. టెర్రరిజంకు అడ్డుకట్ట వేయడానికి అంతర్జాతీయ సమాజం సహకారించాలని మంత్రి సూచించారు. గాబోన్ విదేశాంగ మంత్రి మౌస్సా ఆడామో, యూఎన్ ఎస్సీ ప్రెసిడెంట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.