ప్రైవేట్ టీచర్లకు రూ.2వేల సాయం రెండు నెలలకే ఆగింది!

ప్రైవేట్ టీచర్లకు రూ.2వేల సాయం రెండు నెలలకే ఆగింది!
  • జూన్​ నెల పైసలు ఇప్పటికీ రాలే.. బియ్యంతోనే సరి
  • నిధుల్లేకనే ఆగిందంటున్న విద్యాశాఖ ఆఫీసర్లు 
  • వస్తయో లేదోనన్న ఆందోళనలో 2.04 లక్షల మంది టీచర్లు
  • ఆన్​లైన్​ క్లాసులు స్టార్టయినా 80% మందికి ఉపాధి కరువు
  • ఫిజికల్​ క్లాసులు స్టార్టయ్యే దాకా సాయం కొనసాగించాలని విజ్ఞప్తి 
  • మామూలుగా చనిపోయినట్టు రాసిచ్చిన్రు

హైదరాబాద్, వెలుగు: బడులు తెరిచేదాక ప్రైవేటు స్కూళ్ల టీచర్లకు ప్రతి నెలా రూ.2 వేలు అందిస్తామని ప్రకటించిన సర్కార్.. జూన్​ నెల సాయాన్ని ఇప్పటికీ ఇవ్వలేదు. గురువారం నుంచి ఆన్​లైన్​ క్లాసులు స్టార్ట్​ చేసినందున  సాయాన్ని  ఆపేస్తుందేమోనన్న ఆందోళనలో టీచర్లు ఉన్నారు. ఆన్​లైన్​ క్లాసులు స్టార్టయినా 80 శాతం మంది టీచర్లకు ఉపాధి లేకుండాపోయింది. కేవలం 20 శాతం మంది స్టాఫ్​తోనే స్కూల్​ యాజమాన్యాలు  ఆన్​లైన్​ క్లాసులు నడిపిస్తున్నాయి.  

రెండు నెలలు ఇచ్చి..!

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసేయడంతో  ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు స్కూల్స్​ టీచర్లు, సిబ్బందికి సాయం అందిస్తామని ఏప్రిల్ 8న  సీఎం కేసీఆర్​ ప్రకటించారు. స్కూళ్లు ప్రారంభించేంత వరకూ నెలకు రూ. 2 వేల నగదు, ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యం అందిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ నెల నుంచి ఈ స్కీమ్ అమలవుతుందని తెలిపారు. విద్యాశాఖ అధికారులు అప్లికేషన్ల ప్రక్రియ, స్క్రూటినీతో పాటు బ్యాంక్ ఖాతా నెంబర్లు, ఇతర వివరాలు సేకరించారు. 

ఈ క్రమంలో ఏప్రిల్ 20 నుంచి టీచర్ల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. ముందుగా ‘యూడైస్​’లో ఉన్న వారికే ఇస్తామని చెప్పిన సర్కారు.. ఆ తర్వాత అప్లయ్​ చేసుకున్న ప్రతి ప్రైవేట్​ టీచర్​కు ఇస్తామని తెలిపింది. దీంతో 11,046 ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న 2,04,743 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికీ రూ. 2 వేల నగదు, రూ. 25 కిలోల బియ్యాన్ని ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఇచ్చింది.  జూన్​కు  సంబంధించి బియ్యం పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ రూ. 2 వేలు మాత్రం ఇప్పటికీ అందలేదు. మే నెల ఆర్థిక సాయం మూడో వారంలో అందగా.. జూన్​కు సంబంధించిన సాయం నెల దాటిపోతున్నా అందకపోవడంతో ప్రైవేట్​ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఆన్​లైన్​ క్లాసులు ప్రారంభమయ్యాయనే పేరుతో నగదు మొత్తం ఆపేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. 

80% మందికి ఉపాధి లేదు

సర్కారు ఇచ్చిన పర్మిషన్​తో గురువారం నుంచి స్కూళ్లలో ఆన్​లైన్ క్లాసులు స్టార్టయ్యాయి. అయితే 20 శాతంలోపు టీచర్లనే డ్యూటీలకు రావాలని మేనేజ్​మెంట్లు ఆదేశించాయి. దీంతో 80 శాతానికి పైగా టీచర్లకు ఉపాధి లేకుండాపోయింది. ఆన్​లైన్​ క్లాసులే కావడంతో కొద్దిమంది సేవలనే మేనేజ్​మెంట్లు వినియోగించుకుంటున్నాయి. వారికి కూడా సగం జీతమే ఇస్తామని కొన్ని మేనేజ్​మెంట్లు చెప్తున్నాయి. ఏడాదిన్నర నుంచి కరోనా వల్ల బడులు సరిగ్గా నడువక, జీతాలు రాక ప్రైవేట్​ స్కూళ్ల టీచర్లు తిప్పలు పడుతున్నారు. భారంగా బతుకుబండి లాగిస్తున్నారు. సెకండ్​ వేవ్​లో సర్కారు ప్రకటించిన రూ. 2 వేలు, 25 కిలోల బియ్యంతోనైనా కొంతలో కొంతైనా కష్టాలు తీరుతాయని భావిస్తే రెండు నెలలు మాత్రమే సాయం అందింది. జూన్​ నెలకు సంబంధించి బియ్యం పంపిణీ ఇంకా కొనసాగుతున్నా.. నగదు సాయం మాత్రం ఎవరికీ అందలేదు. స్కూళ్లలో ఫిజికల్​ క్లాసులు స్టార్టయ్యే వరకు సాయం కొనసాగించాలని ప్రైవేటు టీచర్లు కోరుతున్నారు. 

సాయం ఆపొద్దు

ప్రస్తుతం ఆన్​లైన్ క్లాసులకు రాష్ట్ర సర్కారు పర్మిషన్ ఇచ్చింది. దీంతో మాకు నగదు సాయం ఆపుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ జూన్ నెల సాయం అందలేదు. వెంటనే జూన్ నెల సాయం అందివ్వాలి. ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యేంత వరకూ రూ. 2 వేలు, 25 కిలోల బియ్యాన్ని టీచర్లకు అందించాలి. 
- షబ్బీర్ అలీ, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు 

తక్కువ మందినే తీసుకుంటున్నరు

ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లో ఆర్థిక సాయం అందించింది. జూన్ సాయం ఇంకా అందలేదు. ప్రస్తుతం ఆన్​లైన్ క్లాసులు నడుస్తున్నాయి. స్కూళ్లలో తక్కువ మంది టీచర్లనే తీసుకుంటున్నరు. జీతం కూడా సగమే ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ఈ సాయాన్ని ఈ అకడమిక్ ఇయర్ పూర్తయ్యే వరకూ కొనసాగించాలి. దీంతో పాటు టీచర్లకు, సిబ్బందికి హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి.
- నాగరాజు, టీచర్, హుజూర్​నగర్​ 
నా భర్త బాబుసింగ్, మా అత్తమ్మ చాంగోని బాయి ఇద్దరూ ఆగస్టు 13న ఒకేరోజు కరోనాతో చనిపోయిన్రు.
 15 రోజుల తర్వాత టెన్షన్‌తో మామ కూడా చనిపోయిండు. నాకు ఇద్దరు చిన్నపిల్లలు. మేము ఎలా బతకాలి.? పిల్లల్ని ఎలా సాదుకోవాలి?  నా భర్త, అత్తమ్మ ఇద్దరూ కరోనాతో చనిపోయినట్లు రిపోర్టులు ఉన్నా.. మున్సిపాలిటీ వాళ్లు మాత్రం డెత్ సర్టిఫికెట్‌లో మామూలుగా చనిపోయినట్టు రాసిచ్చిన్రు. 
‑ సావిత్రి, నారాయణ్​ఖేడ్

డిసెంబర్ వరకూ ఇవ్వాలి

నేను పనిచేసే స్కూల్ లో మొత్తం 25 మంది టీచర్లుంటే.. ఇప్పుడు సగం మందినే స్కూల్​కు రమ్మన్నారు. ఆన్​లైన్ క్లాసులని మిగిలిన వారిని తీసేశారు. వచ్చిన వారికి కూడా సగమే జీతం అంటున్నారు. తక్కువ జీతంతో కుటుంబాలు గడవడం కష్టం. రూ. 2 వేల సాయాన్ని డిసెంబర్ వరకూ కొనసాగించాలి. జూన్ నెల రూ. 2 వేలు కూడా వెంటనే ఇవ్వాలి. 
‑ సురేందర్ కర్నె, ప్రైవేటు స్కూల్ టీచర్​, మేడ్చల్ జిల్లా