IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్

IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక పాండ్య ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గెలుపోటములను పక్కన పెడితే పాండ్య వైఖరి ఎవరికీ నచ్చడం లేదు. రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన హార్దిక్ తొలి మ్యాచ్ నుంచే ట్రోలింగ్ కు గురవుతున్నాడు. దీనికి తగ్గట్లు పాండ్య తన ప్రవర్తన మారదన్నట్టు ఎవరినీ లెక్క చేయడం లేదు. ఓ వైపు కెప్టెన్ గా.. మరోవైపు బ్యాటర్ గా దారుణంగా విఫలమవుతున్నాడు. హార్దిక్ కెప్టెన్సీపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మండిపడ్డాడు. 

అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు (ఏప్రిల్ 27) జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లింగ్ లో ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ చివరి ఓవర్లో విజయం సాధించింది. ఏ మ్యాచ్ లో హార్దిక్ బౌలింగ్ ప్రణాళికలపై కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కామెంటరీ బాక్స్‌లో ఉన్న కైఫ్.. ముంబై కెప్టెన్ పై మాట్లాడుతూ.. "హార్దిక్ పాండ్యా మెదడు అస్సలు పనిచేయడం లేదు. కొన్నిసార్లు అతను మొదటి ఓవర్ లో బౌలింగ్ చేయడానికి వస్తాడు. మరికొన్నిసార్లు 5 వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వస్తాడు. ఎలాంటి ప్రణాళిక లేకుండా కెప్టెన్సీ చేస్తున్నాడు" అని ఈ భారత మాజీ క్రికెటర్ అన్నాడు.

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆడిన 9 మ్యాచ్ ల్లో 3 విజయాలు మాత్రమే సాధించిన ముంబై.. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే  చివరి 5 మ్యాచ్ ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి హార్దిక్ సేన మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.