Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..

Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..

తెలంగాణ చరిత్రలో కాకతీయులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కాకతీయ పాలకులు ప్రజలకు మేలు చేసే పనులు ఎన్నో చేశారు. గొలుసు కట్టుచెరువులు, ఆలయాలు, కోటలు కట్టించారు. బావులు తవ్వించారు. ప్రజల సౌకర్యం కోసం పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చి. తర్వాతి పాలకులకు ఆదర్శంగా నిలిచారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాకతీయుల సైనిక వ్యవస్థ మరో ఎత్తు. రాజ్యాన్ని శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ఎంతో సైన్యాన్ని పోషించారు. వాళ్లకోసం రహస్య స్థావరాలను ఏర్పాటు చేశారు. అందులోనే ఒకటి కాపురం గుట్టల్లో ఉంది.
 
 కాపురం గ్రామ సరిహద్దులోని అడవిని అనుకుని కాపురం గుట్టలు ఉన్నాయి. అందులో ఒక గుట్టపైన కాకతీయ రాజులు కట్టించిన రహస్య సైనిక స్థావరం ఉంది. కానీ, అది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకతీయ సైనిక అధికారులు ఈ ప్రాంతం శత్రు దుర్భేద్యంగా ఉందని గుర్తించి రహస్య స్థావరం. ఏర్పాటు చేశారు. ఇక్కడి సైనికులకు కఠిన శిక్షణ ఇచ్చి మెరికల్లా తయారు చేసి.. వాళ్లని ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉంచేవాళ్లు. శత్రువుల దాడి నుంచి తట్టుకునేందుకు ఈ స్థావరం చుట్టూ రక్షణ గోడను కూడా కట్టించారు.

 స్థావరం నిర్మించేందుకు కావాల్సిన డంగు సున్నాన్ని కొండపైనే తయారు చేసేవాళ్లు. అందుకోసం ఉపయోగించిన రోళ్లు ఇప్పటికీ ఉన్నాయి. కొండ పైన నీళ్ల కోసం పెద్ద పెద్ద బావులు తప్పించారు. ఇక్కడ శిథిలమైన కట్టడాలు అనేకం ఉన్నాయి. ఈ స్థావరం పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. దాంతో గుప్తనిధులు లభిస్తాయన్న ఆపేక్షతో అనేక మంది ఇక్కడ తవ్వకాలు జరిపారు. దాంతో కొన్ని కట్టడాలు ధ్వంసం అయ్యాయి. 

ఇదీ చరిత్ర

ఈ నిర్మాణం రెండో ప్రతాపరుద్రుడి కాలం నాటిది. కాపురం కొండ రహస్య స్థావరానికి సమాంతరంగా పశ్చిమ దిశలో రామగిరి ఖిల్లా, తూర్పు దిశలో ప్రతాపగిరి ఖిల్లా ఉన్నాయి. క్రీ.శ. 1303లో ఢిల్లీ చక్రవర్తి "అల్లాఉద్దీన్ ఖిల్లీ" సేనాని మాలిక్ కాఫర్ కాకతీయ రాజ్యంపై దండెత్తాడు. ఖాఫర్ దాడిని ముందే పసిగట్టిన కాకతీయ సామ్రాజ్య సైనికాధ్యక్షుడు పోతుగంటి మైలి' తన సైన్యంతో హుజురాబాద్ ప్రాంతంలోని ఉప్పరపల్లి గ్రామ సరిహద్దుల్లో ఎదుర్కొని పోరాడాడు. అప్పటికే రామగిరి, ప్రతాపగిరి కోటల్లో ఉన్న సుశిక్షితులైన సైనికుల సహాయంతో మాలిక్ ఖాఫర్ను ముప్పుతిప్పలు పెట్టాడు. 

కానీ, మాలిక్ ఖాఫర్ సైనిక బలం ముందు ప్రతాపరుద్రుడు నిలవలేకపోయాడు. దాంతో లొంగిపోయి సంధి చేసుకున్నాడు. అయితే, తాను విజయం కోసం సుదీర్ఘ కాలం ముప్పుతిప్పలు పడడానికి కారణం రామగిరి.. ప్రతాపగిరిలోని రహస్య సైనిక శిబిరాలు అని గుర్తించి వాటిని ధ్వంసం చేయించాడు. మాలిక్ కాఫర్, దాంతో ఆందోళన చెందిన ప్రతాపరుద్రుడు మరో రహస్య సైనిక స్థావరం ఏర్పాటు చేయాలని సైనికాధ్యక్షుడిని ఆదేశించాడు. దాంతో కాకతీయ సామ్రాజ్యం మొత్తం తిరిగాడు 'పోతుగంటి మైలి'. చివరకు దట్టమైన దండకారణ్యంలో ఉన్న కాపురం గ్రామ సరిహద్దులోని ఎత్తయిన మూడు కొండలను గుర్తించాడు. అక్కడే రహస్య సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేశాడు.


రెండో సారి

కొంతకాలంపాటు ఢిల్లీ చక్రవర్తులకు కప్పం చెల్లించిన ప్రతాపరుద్రుడు రాజ్యంలో కరువు కాటకాల వల్ల ఒకసారి కొంత ఆలస్యం చేశాడు. దాంతో ఆగ్రహించిన తుగ్లక్ కుమారుడు ఉల్లుఖాన్ క్రీ.శ. 1321లో కాకతీయ రాజ్యంపై దాడికి దిగాడు. సైన్యాధ్యక్షుడు పోతుగంటి సహాయంతో ప్రతాపరుద్ర రాజు ఆ దాడిని విజయవంతంగా ఎదుర్కొన్నాడు. దాడిని ఎదుర్కోవడంలో కాపురం గుట్ట సైనికులు ముఖ్య పాత్ర పోషించారు. 

ఓటమిని అవమానంగా భావించిన ఉల్లు ఖాన్ కొంతకాలం తర్వాత భారీ సైన్యంతో తిరిగి దాడి చేశాడు. ఈ దాడిలో కూడా ప్రతాపరుద్రుడికి కాపురం కొండల్లోని సుశిక్షితులైన సైనికులు సహాయంగా ఉన్నారు. వీరోచితంగా పోరాడారు. కానీ, ఆ యుద్ధంలో ప్రతాపరుద్రుడు ఓడిపోయి బందీగా పట్టుబడతాడు. దాంతో కాకతీయ సామ్రాజ్యం అంతరించింది. అయితే తనను ముప్పుతిప్పలు పెట్టడానికి కారణమైన కాపురం కొండ మీదున్న రహస్య సైనిక స్థావరాన్ని తుగ్లక్ సేవలు ధ్వంసం చేస్తాయి. అలా ధ్వంసమైన కాపురం కొండలే నేడు కాకతీయ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

భైరవి మాత ఆలయం

ఈ కొండపై ఒక పక్క భైరవి మాత ఆలయం ఉంది. అప్పట్లో యుద్ధ వీరులు భైరవి మాతను తమ ఆరాధ్య దైవంగా కొలిచేవాళ్లు. అమ్మవారికి పూజలు చేసి జంతుబలులు ఇచ్చేవాళ్లు. కొండపై మరో పక్క శిథిలావస్థలో ఉన్న శివాలయం, విష్ణుమార్తి
ఆలయం ఉంది.