అర్హుల కోసం సర్వే!..వెలుగుమట్ల భూదాన్  భూముల్లో నష్టపోయిన వారి వివరాలతో ఫీల్డ్ ఎంక్వైరీ

అర్హుల కోసం సర్వే!..వెలుగుమట్ల భూదాన్  భూముల్లో నష్టపోయిన వారి వివరాలతో ఫీల్డ్ ఎంక్వైరీ
  • 14 మంది తహసీల్దార్లకు విధులు
  • 742 మంది వివరాలను జల్లెడ పడుతున్న అధికారులు
  • వసూళ్లపై కొనసాగుతున్న పోలీసుల ఎంక్వైరీ
  • ఇప్పటి వరకు నలుగురు అరెస్ట్, 15 కేసులు నమోదు

ఖమ్మం, వెలుగు: వెలుగుమట్లలోని భూదాన్​ భూముల్లో ఇండ్లు కోల్పోయిన వారికి సంబంధించిన సామాజిక, ఆర్థిక సర్వే ముమ్మరంగా జరుగుతోంది. అర్హులైన పేదవారికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అర్హులను గుర్తించేందుకు 21 మంది తహసీల్దార్లకు ఖమ్మం కలెక్టర్  అనుదీప్​ దురిశెట్టి సర్వే బాధ్యతలు అప్పగించారు.

కూల్చివేతల సమయంలోనే బాధితుల నుంచి సమగ్ర సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఆ తర్వాత పునరావాస కేంద్రాల్లోనూ బాధితుల వివరాలను సిబ్బంది నోట్  చేసుకుంటున్నారు. కూల్చివేతల సమయంలో 632 కుటుంబాలు అక్కడ ఉన్నట్లు గుర్తించగా, దాన్ని విశ్లేషించి ఇప్పటికే మండలాలు, జిల్లాల వారీగా విభజించారు. వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన వారు 522 మంది, ఇతర జిల్లాలకు చెందిన వారు 107 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఉన్నారు.  

మండలాల వారీగా వివరాల సేకరణ!

ఖమ్మం జిల్లాలోని 21 మంది తహసీల్దార్లు సర్వేలో నిమగ్నమయ్యారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పని పూర్తి చేయాలని రెండ్రోజుల కింద కలెక్టర్  అనుదీప్​ ఆదేశించగా, ఇప్పటి వరకు ఖమ్మం అర్బన్  మండలానికి చెందిన 182 మంది, ఖమ్మం జిల్లాలోని మండలాలకు చెందిన 340 మంది ఉన్నారని లెక్కతేల్చారు. ఇతర జిల్లాలకు చెందినవారు 107 మంది ఉండగా, వారి వివరాల కోసం కూడా అధికారులకు బాధ్యతలు అప్పగించారు.

భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన వారు కూడా ఇక్కడి బాధితుల్లో ఉన్నారు. ఏపీకి చెందిన ఇద్దరు, బీహార్​కు చెందిన ఒకరు కూడా రేకుల షెడ్డు వేసుకొని ఉన్నట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి, ఆ తర్వాత అర్హులకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పత్రాలను అందజేయాలని అధికారులు నిర్ణయించారు. 

వసూల్​ రాయుళ్ల కోసం పోలీసుల దర్యాప్తు!

ఒకవైపు బాధితులను ఆదుకునేందుకు అధికారుల ఎంక్వైరీ కొనసాగుతుండగా, మరోవైపు బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసిన దళారుల కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఓపీడీఆర్​ భూదాన్​ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారం చేసి, ఇండ్ల స్థలాలు ఇస్తామంటూ ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసిన నలుగురిని అరెస్ట్  చేశారు.

అక్రమంగా భూదాన్​ భూములను ఆక్రమించి షెడ్డు వేసి, ఆ తర్వాత వేరే వాళ్లకు అమ్మి మోసం చేశారని 13 మందిపై 9 కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అయిన వారిలో తల్లూరి కృష్ణ, మంకిడి లింగరాజు, ముడిగ రాములు, కల్తీ ఎర్రబాబు ఉన్నారు. ఈ ముఠాలో కల్తి రామచంద్రయ్య, కొప్పెర వెంకన్న, పాస్టర్​ బాబూరావు, దండ లింగస్వామి, దండ లింగయ్య, వీరన్న, కుంజ కృష్ణ, కొట్టే బసు, యడెల్లి శ్రీను, చలం, చంద్ర మోహన్,​ లక్ష్మణ చారి, ముత్తయ్య ఉన్నారని, వారిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఓపీడీఆర్​ భూదాన్​ కమిటీ సభ్యుల పేరుతో ఈ వసూళ్ల దందా కొనసాగగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, ఉమ్మడి నల్గొండ, వరంగల్  జిల్లాల పరిధిలోని కొన్ని మండలాల్లో ఈ సంఘానికి చెందిన నేతలున్నారు. ఖమ్మంలో ఇండ్ల స్థలం తక్కువ ధరకు వస్తుందని నమ్మించి డబ్బులు వసూలు చేశారని పోలీసులు ఆఫ్​ ది రికార్డుగా చెబుతున్నారు. 

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం : మంత్రి తుమ్మల

వెలుగుమట్ల భూదాన్  భూముల్లో ఇండ్లు కోల్పోయిన వారిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు తెలిపారు. అర్హులను గుర్తించాలని ఖమ్మం కలెక్టర్ ను ఆదేశించినట్లు చెప్పారు. పేదల సంఘం ముసుగులో విలువైన ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అన్యాక్రాంతం చేసి, సొమ్ము చేసుకుంటుంటే ప్రభుత్వంగా చూస్తూ ఊరుకోదని తెలిపారు.

అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తామని, పేదల విషయంలో మానవీయంగా ఉంటామని చెప్పారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టించి, గృహ ప్రవేశాలు చేయించే బాధ్యత తనదేనన్నారు. భూదాన్ భూముల అక్రమార్కులపై ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పేదలను మోసం చేసిన వారిని కాపాడేలా బీఆర్ఎస్  నేతలు హంగామా చేస్తున్నారని విమర్శించారు.

యుద్ధ ప్రాతిపదికన సర్వే..

ఖమ్మం అర్బన్​ మండలం వెలుగుమట్లలో ఫిబ్రవరి 24న భూదాన్  భూముల్లో చేపట్టిన ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో ఇండ్లు కోల్పోయిన వారిపైన సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టాం. జిల్లాలోని 21 మంది తహసీల్దార్లకు సర్వే చేయాలని ఆదేశాలిచ్చాం. ఇతర జిల్లాలకు చెందిన వారితో పాటు ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. వేరే జిల్లాల్లో ఉన్న వారి వివరాలను క్రాస్  చెక్  చేయాలని ఆదేశించాం.

అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తాం. సర్వేకు సంబంధించిన వారు గ్రామాల్లో అందుబాటులో ఉండి, సామాజిక, ఆర్థిక సర్వేకు సహకరించాలి. - అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం జిల్లా కలెక్టర్