జడ్చర్ల, వెలుగు : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మళ్లీబోయిన్ పల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్ము శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇటీవల తమ ఇంట్లో జరిగిన మరణం కారణంగా, శుక్రవారం రాత్రి జడ్చర్ల పట్టణంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నిద్ర చేసేందుకు వెళ్లారు.
ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 8 తులాల బంగారు నగలు, కిలోన్నర వెండి, రూ. 70 వేల నగదును దోచుకెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన బాధితులు సామగ్రి చిందరవందరగా పడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీంతో విచారణ చేపట్టిన జడ్చర్ల టౌన్ సీఐ కమలాకర్, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అయితే, కిష్టారెడ్డి కాలనీలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన మరువకముందే ఈ భారీ చోరీ జరగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస దొంగతనాల నేపథ్యంలో పోలీసులు గస్తీ పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గద్వాలలో..
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని దౌదర్ పల్లి కాలనీలో శనివారం పట్టపగలే భారీ దొంగతనం కలకలం రేపింది. కాలనీకి చెందిన జితేందర్ తన కుటుంబంతో కలిసి ధరూర్ మండలం పెద్ద చింతరేవుల ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లగా, గుర్తుతెలియని దుండగులు మధ్యాహ్నం ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పొరుగువారు బాధితులకు సమాచారం అందించారు.
ఇంటికి చేరుకున్న బాధితులు, బీరువాలో ఉన్న రూ.52 వేల నగదుతో పాటు మూడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీం సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
