టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ ఎట్టకేలకు తమ టార్గెట్‌ను పూర్తి చేశాయి. తమ చిరకాల శత్రువు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపేశాయి. మరోవైపు ఖమేనీ హత్యతో ఇరాన్ రగిలిపోతుంది. ఈ క్రమంలో ఖమేనీని తుదిముట్టించిన అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని.. ఎవరిని వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పింది. గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీర మరణం పొందారని పేర్కొంది.
ఖమేనీ మరణానికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని.. తమ రివేంజ్ ఎలా ఉంటుందో కనీసం ఊహించలేరని హెచ్చరించింది. సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పట్ల ఇరాన్ 40 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఇరాన్ కేబినెట్ కూడా ఖమేనీ మృతిని తీవ్రంగా ఖండించింది. ఖమేని మరణాన్ని మహా నేరంగా అభివర్ణించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలేది లేదని స్పష్టం చేసింది.
ఖమేనీ ఖతం..!
అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఇరాన్ మీడియా అధికారికంగా ధృవీకరించింది. తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ, ఫార్ట్స్ న్యూస్ ఏజెన్సీ వంటి ప్రధాన ఇరానియన్ వార్తా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేశాయి. ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు తెలిపాయి. ఖమేనీ కూతురు, అల్లుడు, కోడలు, మనుమడు చనిపోయినట్లు పేర్కొంది.
