కోర్ అర్బన్  ఏరియాలో  స్పెషల్ కంట్రోల్ రూమ్!

కోర్ అర్బన్  ఏరియాలో  స్పెషల్ కంట్రోల్ రూమ్!
  • అత్యవసర సేవలపై త్వరలో ఏర్పాటు
  • మూడు కార్పొరేషన్​ల పరిధిలో జవాబుదారీతనం పెంచేందుకే
  • ఫీల్డ్ లెవల్ తనిఖీలకు టాస్క్​ఫోర్స్
  • కసరత్తు చేస్తున్న అధికారులు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్​ల (జీహెచ్‌‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి)లో ప్రజలకు అందుతున్న ఆరోగ్య, అత్యవసర సేవలపై త్వరలో ప్రత్యేక కంట్రోల్ రూమ్​ఏర్పాటు కానుంది. ముఖ్యంగా పారిశుధ్యం, దోమల నివారణ, ఫుడ్ సేఫ్టీ వంటి కీలక విభాగాల్లో జవాబుదారీతనం పెంచేందుకు జీహెచ్ఎంసీ హెడ్​ఆఫీస్​లో ఈ ప్రత్యేక కంట్రోల్ రూమ్​ను ఏర్పాటు చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇటీవల మున్సిపల్ శాఖపై నిర్వహించిన సమీక్షల్లో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సేవల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించడమే దీనికి ప్రధాన కారణం. క్షేత్రస్థాయిలో అలసత్వం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని, అవసరమైతే సస్పెన్షన్ వేటు వేయాలని సీఎం స్పష్టం చేయడంతో జీహెచ్‌‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్లు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పారిశుధ్య పనులు, ఫాగింగ్ ప్రక్రియలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. 

ఫీల్డ్ లెవల్​లో టాస్క్ ఫోర్స్ బృందాలు

తరచూ లోపాలు, అక్రమాలు బయటపడుతున్న ఎంటమాలజీ, పారిశుద్ధ్యం వంటి విభాగాలను గాడిలో పెట్టేందుకు త్వరలోనే క్షేత్రస్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలను కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బృందాల కోసం కొత్తగా సిబ్బందిని నియమించకుండా, ఒక సర్కిల్​లో వివిధ సేవలను పర్యవేక్షించే సిబ్బందిని ఇతర సర్కిల్స్​కు టాస్క్ ఫోర్స్ టీమ్​లుగా పంపాలని నిర్ణయించారు. దీనివల్ల ఫీల్డ్ లెవల్​లో ప్రజలకు అందుతున్న సేవల అసలు స్థితిగతులు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ బృందాలతో ఫుడ్ సేఫ్టీని కూడా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు చేసే అవకాశం ఏర్పడనుంది.

రీ-మ్యాపింగ్ ప్రక్రియ తర్వాతే.. !

ప్రస్తుతం పాత జీహెచ్‌‌ఎంసీలోని అన్ని విభాగాలను మూడు కార్పొరేషన్లకు తగిన విధంగా రీ–మ్యాపింగ్ చేసే ప్రక్రియ తుది దశలో ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే టాస్క్ ఫోర్స్ బృందాలు, కంట్రోల్ రూమ్​అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా ఆరోగ్య పరమైన అత్యవసర సేవల పర్యవేక్షణ నిరంతరం కొనసాగేలా జీహెచ్‌‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తానికి సీఎం వరుస సమావేశాలు. హెచ్చరికలతో మున్సిపల్ అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.

కంట్రోల్ రూమ్ ఎందుకంటే? 

మున్సిపల్ శాఖపై సీఎం నిర్వహించిన తాజా రివ్యూ మీటింగ్​లో కోర్ అర్బన్ రీజియన్ ప్రజలకు అందుతున్న హెల్త్ సర్వీసులపై స్పెషల్​ఫోకస్ పెట్టి, జవాబుదారీతనాన్ని పెంచాలని సూచించారు. ఈ నేపథ్యంలో పారిశుధ్యం, ఎంటమాలజీ విభాగంలో దోమల నివారణ, వెటర్నరీ విభాగంలో కుక్కల నియంత్రణతో పాటు బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ వంటి ప్రక్రియలను మరింత పటిష్టం చేసేందుకు స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఫీల్డ్ లెవల్ నుంచి అందుతున్న నివేదికలు నివేదికలు ఎంతవరకు నిజమనేది ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు సరిచూసుకునే అవకాశం ఉంటుంది. గతంలో దాదాపు 25 వేల వరకు పెండింగ్​లో ఉన్న బర్త్, డెత్ సర్టిఫికెట్లను అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ఇప్పటికే 6 వేలకు తగ్గించడం గమనార్హం. ఈ ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.