పార్టీ పేరుతో ట్రాప్.. మర్డర్

పార్టీ పేరుతో ట్రాప్.. మర్డర్

​చేపల వ్యాపారి మర్డర్ కేసులో నిందితుడు రాజు అరెస్ట్

చేపల వ్యాపారి రమేశ్ కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు ముదే రాజు నాయక్ అలియాస్ సంతోష్ రాజ్(21) ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, ఎస్ ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బు, బంగారం కోసమే ప్లాన్ ప్రకారం రమేశ్​ను రాజు హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.  వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ కేసు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. బోరబండ ఏజీ కాలనీలో ఉంటున్న చేపల వ్యాపారి పంపరి రమేశ్(55)కి  రామారావ్ నగర్ లో మరో ఇల్లు ఉంది. అనంతపురం జిల్లా కదిరిలోని తనకల్లుకి చెందిన రాజు నాయక్ 2016 నుంచి ఆ ఇంట్లో రెంట్ కు ఉంటున్నాడు. రమేశ్,రాజు మధ్య పరిచయం పెరగడంతో  పార్టీలు చేసుకునేవారు. ఇద్దరూ కలిసి మద్యం తాగేవారు. రమేశ్ ఒంటిపై ఉన్న బంగారం, చేపల వ్యాపారాలను రాజు నాయక్ గమనించాడు. రమేశ్​కొత్తగా వేరే ఇల్లు కొన్నట్టు తెలుసుకున్నాడు.  దీంతో రమేశ్ ను ట్రాప్ చేసి అతడి దగ్గరి నుంచి  భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయాలని రాజు నాయక్ ప్లాన్ చేశాడు. తన ప్లాన్ లో భాగంగా గత నెల 2న యూసుఫ్​గూడ జవహర్ నగర్ లోని గాంధీ విగ్రహం వద్ద రూ.7 వేలతో ఓ రూమ్ ను రెంట్ కు తీసుకున్నాడు. ఓ కొత్త సిమ్ కార్డు, సుత్తి,కత్తి, ఆల్ ఫ్రాజోలమ్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కొన్నాడు. వీటిని మల్కాజిగిరిలో ఉండే తన రెండో భార్య ఇంట్లో రాజు భద్రపరిచాడు. నెలరోజులుగా రమేశ్​ను ట్రాప్ చేసేందుకు స్కెచ్ వేశాడు. ఈ నెల 1న జవహర్ నగర్ లోని తన రూమ్ కి రావాలని రమేశ్ కి రాజు ఫోన్ చేశాడు. సాయంత్రం 7.30కు  రమేశ్ అక్కడికి వెళ్లాడు.

మందులో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలిపి..

రమేశ్ ఒంటిపై ఉన్న బంగారాన్ని కొట్టేసి, కిడ్నాప్ డ్రామా ఆడి పెద్దమొత్తంలో డబ్బులు కొట్టేయాలని అప్పటికే రాజు ప్లాన్ చేసుకుని ఉన్నాడు. తన రూమ్ కి వచ్చిన రమేశ్​కు రాజు మద్యం గ్లాసులో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలిపి తాగించాడు.  రమేశ్ స్పృహ తప్పిపడిపోగా..రాజు అతడి తలపై రెండు సార్లు సుత్తితో  కొట్టి హత్య చేశాడు. ఒంటిపై ఉన్న బంగారు నగలతో పాటు పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కుండా ఐడీ కార్డ్స్, రమేశ్  మొబైల్ ఫోన్స్ తీసుకుని రాజు పారిపోయాడు.

బంగారం తాకట్టు పెట్టి..

మల్కాజిగిరిలోని తన రెండో భార్య  ఇంటికి వెళ్లిన రాజు..జరిగిన విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఈ నెల 2న ఉదయం 10 గంటల ప్రాంతంలో రమేశ్ కోడలికి రాజు వాట్సాప్ మెసేజ్ చేశాడు. అందులో రమేశ్ తాగి పడిపోయాడని తేరుకున్నాక పంపిస్తామని ఉంది.  ఈ నెల 3న రమేశ్ బంగారాన్ని మణప్పురం గోల్డ్ లో తాకట్టు పెట్టి రూ.లక్షా41 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత రమేశ్ డెడ్ బాడీ ఉన్న రూమ్ కి చేరుకున్నాడు.

డెడ్ బాడీని ప్లాస్టిక్ కవరల్ ప్యాక్ చేసి..

రమేశ్ బాడీని కట్ చేసి బ్యాగ్ లో ప్యాక్ చేసేందుకు రాజు నాయక్ ప్లాన్ చేశాడు. ముందుగా రెండు చేతులను కట్ చేసి కవర్ లో ప్యాక్ చేశాడు. ఆ తర్వాత రెండు కాళ్ళను కట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అవి కట్ కాకపోవడంతో రెండు కాళ్ళను మడిచి బ్యాగ్ లో ప్యాక్ చేశాడు. దాన్ని బెడ్ షీట్ తో కప్పి మూట కట్టాడు. రూమ్ లో దుర్వాసన రాకుండా సెంట్ చల్లారు. ఆ తర్వాత రాజు మరోసారి రమేశ్ కుటుంబీకులకు వాట్సాప్ మెసేజ్ చేసి రూ. 90 లక్షలు డిమాండ్ చేశాడు.

 

ఇలా చిక్కిండు

టవర్ లోకేషన్, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు రాజునాయక్ ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఈ నెల 5న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. 2007లో అనంతపురం సిటీకి వచ్చిన రాజు కొంతకాలం మూవీ ఆర్టిస్ట్ గా పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. రేపల్లె ప్యాసింజర్ అనే షార్ట్ ఫిల్మ్ లోనూ రాజు యాక్ట్ చేశాడని..ప్రస్తుతం ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నట్టు తెలిపారు.ముందుగా రమేశ్ ఒంటిపై ఉన్న బంగారం కోసం రాజు హత్య చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. రమేశ్ డెడ్ బాడీతో కిడ్నాప్ డ్రామా ఆడి వచ్చిన  ఆ డబ్బుతో పారిపోవాలని ప్లాన్ చేసినట్లు డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.