వలస కార్మికులకు సీపీఐ అండగా ఉంటుంది

వలస కార్మికులకు సీపీఐ అండగా ఉంటుంది

హైదరాబాద్ : వలస కార్మికులకు న్యాయం జరిగే వరకు సీపీఐ అండగా ఉంటుందన్నారు  ఆ పార్టీ నేతలు నారాయణ, చాడా వెంకట్ రెడ్డి. బుధవారం ఎం ఎస్ మక్తాలో వలస కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు సీపీఐ నేతలు నారాయణ, చాడా వెంకట్ రెడ్డిలతో పాటు పలువురు పార్టీ నేతలు. వలస కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ వలస కార్మికులతో కలిసి రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.  ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ..బీహార్ కు సంబందించిన వలస కార్మికులను వారి సొంత గ్రామాలకు పంపించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గంలోని మక్తాలో బీహార్ కు చెందిన వలస కార్మికులు చాలా మంది ఉన్నారని..వారి స్వస్థలాలకు పంపించడంలో కిషన్ రెడ్డి విఫలం అయ్యారన్నారు. ఆకలితో అలమటిస్తున్న వలస కార్మికులకు కాలనీ వాసులే కడుపు నింపుతున్నారన్నారు. ప్రభుత్వాల నుండి అందాల్సిన సహాయం అందలేదని చెప్పారు నారాయణ.

ఇదే విషయంపై చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..వందలాది రైళ్లతో వలస కార్మికులను స్వస్థలాలకు పంపుతున్నామని నిర్మల సీతారామన్ చెప్తున్నారని ..మరి వేలాది మంది వలస కార్మికులు ఇంకా ఇక్కడే ఎందుకున్నారని ప్రశ్నించారు. మక్తాలోని వలస కార్మికులు రంజాన్ పండగకు స్వస్థలాలకు వెళ్లాలని ఆతృత్రగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. పేర్లు నమోదు చేసుకుని 20 రోజులైనా.. ఇంత వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదన్నారు. వలస కార్మికులకు న్యాయం జరిగే వరకు సీపీఐ అండగా ఉంటుందన్నారు చాడా వెంకట్ రెడ్డి.