V6 News

ఇది ప్రజా విజయం కాదు: సిద్ధరామయ్య

ఇది ప్రజా విజయం కాదు: సిద్ధరామయ్య

గవర్నర్ ఆఫీసును బీజేపీ దుర్వినియోగం చేసిందని కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. మెజార్టీ లేకున్నా రాజ్యాంగానికి విరుద్ధంగా యడియూరప్ప సీఎంగా ప్రమాణం చేశారని శనివారం విమర్శించారు. “ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తర్వాత సభలో సభ్యుల సంఖ్య 221కి పడిపోయింది. సర్కారు ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 111. బీజేపీకి కేవలం 105 మంది సభ్యుల బలముంది. ముంబయిలో క్యాంపు వేసిన ఎమ్మెల్యేల మద్దతు తీసుకునే అవకాశం లేదు. వారంతా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు. మెజార్టీ ఎలా నిరూపించుకుంటారు? కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను నిర్బంధించకుండా ఉండుంటే కుమారస్వామి సర్కారు కూలేది కాదు. మా ఎమ్మెల్యేలను అక్రమంగా నిర్బంధించి, సర్కారును కూలగొట్టి ఇది ప్రజా విజయం అని చెబుతున్నారు. ఇది ప్రజల విజయం కాదు. హార్స్ ట్రేడింగ్ విజయం”అని అన్నారు.

స్పీకర్ తప్పుకోవాలి, లేకుంటే అవిశ్వాసమే: కర్నాటక బీజేపీ

కర్నాటక అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ ను గద్దె దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన స్వచ్ఛందంగా రిజైన్ చేయాలని, లేకుంటే అవిశ్వాస తీర్మానం పెడతామని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు శనివారం చెప్పారు. ఈ సమాచారాన్ని ఆయనకు చేరవేసినట్లు తెలిపారు. “రూలింగ్ పార్టీ మెంబర్ స్పీకర్ పదవిలో కొనసాగడం ఆనవాయితీ. రమేశ్ కుమార్ రిజైన్ చేయకుంటే అవిశ్వాస తీర్మానం పెడతాం. సోమవారం బలపరీక్ష నెగ్గడం, ఫైనాన్స్ బిల్లును ఆమోదించుకోవడం మా తొలి అజెండా” అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేశ్ జార్కిహొళి, మహేశ్  కుమటళ్లి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆర్.శంకర్ పై  స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేసిన 24 గంటల్లోనే యడియూరప్ప కర్నాటక ముఖ్యమంత్రిగా  ప్రమాణం చేశారు. ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలతోపాటు మిగిలిన రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చెప్పినట్లు సమాచారం.