పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ అనే పదం వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అప్పులు చేయెుద్దు.. ఉన్న అప్పులను వీలైనంత త్వరగా తీర్చేయండి అనే మాటలే. అయితే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రవికిరణ్ మోనిగరి ఈ పాత ఆలోచనా విధానాన్ని సవాలు చేస్తున్నారు. అప్పులన్నింటినీ ఒకేలా చూడటం వల్ల సంపద సృష్టి కుంటుపడుతుందని అంటున్నారు. అన్ని అప్పులనూ భారతీయులు చెడ్డవిగా భావించటం సరైనది కాదని చెబుతున్నారు. లోన్స్ కేవలం భారం కాదని.. వాటిని సరిగ్గా ఉపయోగిస్తే ఆర్థిక వృద్ధికి సాధనాలుగా మార్చుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
మంచి అప్పు vs చెడు అప్పు..
రవికిరణ్ ప్రధానంగా అప్పులోని రకాన్ని గుర్తించాలని చెబుతున్నారు. ఉదాహరణకు 18% వడ్డీ ఉండే క్రెడిట్ కార్డ్ బకాయిలు ఆర్థికంగా విధ్వంసం సృష్టిస్తాయని.. వీటిని 'చెడు అప్పులు'గా గుర్తించాలని చెప్పారు. కానీ 8.5% వడ్డీతో ఉండే హోమ్ లోన్ మంచి సాధనం అంటున్నారు. అప్పు ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు.. ఆ అప్పుకు మీరు చెల్లిస్తున్న వడ్డీ ఎంత? అది ఏ అవసరం కోసం తీసుకున్నారు? దాని రూల్స్ ఎలా ఉందనేది కీలకమని చెప్పారు.
ఎమోషన్స్ వద్దు.. లెక్కలే ముఖ్యం
చాలామంది అప్పును లెక్కల రూపంలో కాకుండా ఎమోషనల్ యాంగిల్‌లో చూస్తుంటారు ఇండియాలో. 7% వడ్డీ ఉన్న హోమ్ లోన్‌ను కట్టేయడానికి ఆత్రుత చూపిస్తూ.. తమ సేవింగ్స్ అకౌంట్లలో 3.5% వడ్డీకే డబ్బును ఉంచుకుంటారు. లెక్కల పరంగా ఇది తప్పుడు నిర్ణయం. లోన్‌ను ముందస్తుగా క్లియర్ చేసే ముందు ఆపర్చునిటీ కాస్ట్.. అంటే ఆ డబ్బును లోన్ కట్టడానికి వాడకుండా అంతకంటే ఎక్కువ లాభం వచ్చే చోట ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభాన్ని కోల్పోతున్నామని గుర్తించాలి. లోన్ త్వరగా కట్టేయడం వల్ల మానసిక ప్రశాంతత దక్కొచ్చు.. కానీ ఆర్థికంగా అది సరైన నిర్ణయం కాకపోవచ్చు.
లోన్ త్వరగా కట్టేయడం వల్ల నష్టాలేంటి?
లోన్స్‌ను గడువు కంటే ముందే క్లియర్ చేయడం వల్ల చేతిలో ఉండే డబ్బు నిల్వ తగ్గిపోతుంది. పెట్టుబడి క్రమశిక్షణ ఉన్నవారికి.. లోన్ వడ్డీ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకం. ఉదాహరణకు హోమ్ లోన్ వడ్డీ కంటే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే రిటర్న్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, లోన్ క్లోజ్ చేయడం కంటే ఇన్వెస్ట్ చేయడమే తెలివైన పని. పాత పద్ధతులను గుడ్డిగా ఫాలో అవ్వడం వల్ల దీర్ఘకాలంలో మనం సంపాదించాల్సిన భారీ మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దీనికోసం ఆర్థిక నిపుణులను సంప్రదించి సూచనలు తీసుకోవటం బెటర్.
అయితే ప్రతి ఒక్కరికీ ఇది వర్తించదు. ఆదాయం స్థిరంగా లేని వారు.. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు అప్పులు తగ్గించుకోవడమే మేలు. సంపదను పెంచుకోవాలనుకునే వారు మాత్రం హై-ఇంట్రెస్ట్ లోన్స్‌ను ముందుగా తీర్చేసి.. తక్కువ వడ్డీ ఉన్న లోన్స్‌ను కొనసాగిస్తూ మిగిలిన నగదును ఇన్వెస్ట్ చేయాలి. చివరగా.. పర్సనల్ ఫైనాన్స్ అనేది ఫిక్స్‌డ్ ఫార్ములాల గురించి కాదు, అది మనం తీసుకునే 'ట్రేడ్-ఆఫ్స్'మీద ఆధారపడి ఉంటుంది. అప్పులు లేకుండా ఉండటం సేఫ్ అనిపించినా.. అప్పులను తెలివిగా వాడుకోవడమే డబ్బున్నోళ్ల సీక్రెట్ అంటున్నారు ఆర్థిక నిపుణులు.

