బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రులు వీరే

బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రులు వీరే

మాజీ ముఖ్యమంత్రులు బీజేపీలోకి క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ లో ఏండ్లకు ఏండ్లు పదవులు అనుభవించిన మాజీ సీఎంలు..హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి..కాషాయా కండువా కప్పుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం , కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో  బీజేపీ ఆఫీసులో  కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ పార్టీ ముఖ్యనేతలు అరుణ్‌సింగ్‌, లక్ష్మణ్‌ సమక్షంలో  కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాల్లో  ముఖ్యమంత్రులుగా పనిచేసి ..బీజేపీలో చేరిన లీడర్లేవరో  ఓ సారి చూద్దాం 


నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి వివిధ పదవులు చేపట్టారు. 2010 నవంబర్‌ 25 నుంచి 2014 మార్చి 1 వరకు ఆయన  సీఎంగా పనిచేశారు. శాసనసభ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ విభజనను వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.   అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున ఆయన బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్రా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత కొద్దికాలం పాటు  రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. 2018లో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరారు.


కెప్టెన్ అమరీందర్ సింగ్

 2022 సెప్టెంబరులో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా తన పార్టీ - పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బీజేపీలో  విలీనం చేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ నవంబర్ 2021లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి  పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ పేరుతో  కొత్త పార్టీని స్థాపించారు. సెప్టెంబరు 2021లో  నవజ్యోత్‌ సింగ్‌తో విభేదాలు రావడంతో  అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి కాంగ్రెస్‌ తప్పించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమరీందర్ సింగ్..కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ తర్వాత పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయగా..ఒక్క సీటులోనూ విజయం సాధించలేదు. పాటియాలా నుంచి పోటీ చేసి..అమరీందర్ సింగ్‌ కూడా ఓటమిపాలయ్యారు. అనంతరం కాషాయ కండువా కప్పుకున్నారు. 

SM కృష్ణ

2017 మార్చిలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి SM కృష్ణ బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు. SM కృష్ణ అక్టోబర్ 1999 నుంచి మే 2004 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా  డిసెంబర్ 2004 నుంచి  మార్చి 2008 మధ్య మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు. మే 2009 నుండి అక్టోబర్ 2012 వరకు UPA ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు.


దిగంబర్ కామత్

సెప్టెంబరు 2022లో  గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్   బీజేపీలో చేరారు. అంతకుముందు 1994లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2005లో తిరిగి కాంగ్రెస్‌ గూటికి వెళ్లారు. గోవాలో మనోహర్ పారికర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించారు. కామత్ 2007 నుండి 2012 వరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు.

విజయ్ బహుగుణ 

2016 మేలో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ బీజేపీలో చేరారు.  8 మంది మాజీ ఎమ్మెల్యేలతో కలిసి విజయ్ బహుగుణ  కాషాయ  కండువా కప్పుకున్నారు. జనవరి 2014లో  విజయ్ బహుగుణ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. విజయ్ బహుగుణ మార్చి 2012 నుండి జనవరి 2014 వరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

నారాయణ్ దత్ తివారీ

2017 జనవరిలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నారాయణ్ దత్ తివారీ ..అతని కుమారుడు రోహిత్ శేఖర్‌తో కలిసి బీజేపీలో చేరారు. ND తివారీ 2002 నుండి 2007 వరకు ఉత్తరాఖండ్‌కు మూడవ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1976 నుంచి 1989 మధ్య మూడుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2007 ఆగస్టు నుండి  2009 డిసెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా కూడా ఉన్నారు.

పేమ ఖండుడు

 2016 డిసెంబర్ లో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పిపిఎ)కి చెందిన 32 మంది ఎమ్మెల్యేలతో కలిసి పెమా ఖండూ బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఖండూ ప్రభుత్వం జూలై 2016 నుండి అధికారంలో ఉంది.  ఖండూతో పాటు.. దాదాపు అందరు కాంగ్రెస్ శాసనసభ్యులు సెప్టెంబర్ 2016లో పార్టీ  ఫిరాయించారు, దీనితో ఖండూ తన అధికార స్థానాన్ని నిలుపుకునేందుకు బీజేపీలో చేరారు.