తెలుగు అకాడమీ కేసులో  మాజీ డైరెక్టర్ విచారణ

తెలుగు అకాడమీ కేసులో  మాజీ డైరెక్టర్ విచారణ
  • సోమిరెడ్డి సహా మరో ఇద్దరిని విచారించిన సీసీఎస్ 

హైదరాబాద్, వెలుగు: తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్ల స్కామ్ కేసులో సీసీఎస్ దర్యాప్తు కొనసాగుతోంది. అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ రమేశ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రఫీక్ రాజాలను ఆదివారం 3 గంటల పాటు విచారించింది. స్టేట్​మెంట్లు రికార్డు చేసింది. అకాడమీ అకౌంట్స్‌‌ను సీసీఎస్ పరిశీలించింది. యూబీఐ, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన చెక్కులు, క్యాష్ వివరాలు సేకరించింది. ఈ కేసులో ఇప్పటికే యూబీఐ మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ కోఆపరేటీవ్ సొసైటీ చైర్మన్ సుబ్బారావు, సొసైటీ సిబ్బంది పద్మావతి, మొహియుద్దీన్ లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారించేందుకు కస్టడీకి అప్పగించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. 
రెండు అకౌంట్లకు ట్రాన్స్ ఫర్.. 
నిందితులు అగ్రసేన్ బ్యాంకులో ఈ ఏడాది జనవరిలో రెండు అకౌంట్లు ఓపెన్ చేశారు. అదే నెల 16 నుంచి సెప్టెంబర్ వరకు విడతల వారీగా ఆ అకౌంట్లకు డబ్బులు మళ్లించారు. యూనియన్ బ్యాంక్ కార్వాన్ బ్రాంచ్ నుంచి రూ.43 కోట్లు, సంతోష్ నగర్ బ్రాంచ్ నుంచి రూ.10 కోట్లు, చందానగర్ లోని కెనరా బ్యాంక్ నుంచి రూ.10 కోట్లను ఆ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేశారు. సొసైటీ చైర్మన్ సుబ్బారావు సహకారంతో ఆ డబ్బులను విత్ డ్రా చేసుకున్నారు. ఇంతకుముందు అకాడమీ డైరెక్టర్ గా పని చేసిన సత్యనారాయణరెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి.. మార్చిలో కెనరా బ్యాంకులోని రూ.10 కోట్లను మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.