అగ్నిపథ్ స్కీంతో తీవ్ర నిరాశలో యువత

అగ్నిపథ్ స్కీంతో తీవ్ర నిరాశలో యువత
  • నాలుగేళ్లు సర్వీస్... ఆ తర్వాత 25 శాతం మందికే జాబ్ పర్మినెంటా?
  • ఆర్మీలో ఏటా 60 వేల ఖాళీలు ఏర్పడుతుంటే... 46 వేల మందికే అవకాశామా?
  • ఆర్మీ అనేది ఎంప్లాయ్ మెంట్ కల్పించే సంస్థ కాదు... దేశ రక్షణ సంస్థ
  • టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: అగ్నిపథ్ స్కీం దేశ రక్షణకు ప్రమాదకరమని టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అగ్నిపథ్ స్కీంను వెనక్కు తీసుకోవాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. అగ్నిపథ్ స్కీం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఈ స్కీం కింద 46 వేల మందిని 4 ఏళ్ల పాటు ఆర్మీలోకి తీసుకుంటామని, ఆ తర్వాత కేవలం 25 శాతం మందిని పర్మనెంట్ ప్రాతిపదికన రిక్రూట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటన్నారు. సాధారణంగా భారత సైన్యం పర్మనెంట్ ప్రాతిపదికన ప్రతి ఏడాది 60 వేల మందిని రిక్రూట్ చేసుకుంటుందని, అలాంటప్పుడు వాలంటరీ స్కీం పేరుతో 46 వేల మందినే ఎంపిక చేయడం కరెక్టు కాదన్నారు. అభ్యర్థులు బయట ఉద్యోగం చేసేందుకు నాలుగేళ్ల సర్వీస్ కాలంలో అన్ని రకాల స్కిల్స్ ను డెవలప్ చేయనున్నట్లు చెప్పడం దారుణమన్నారు. భారత రక్షణ శాఖ అనేది యువతకు ఎంప్లాయ్ మెంట్ కల్పించేదిగా కాక... దేశ రక్షణలో భాగస్వామ్యమయ్యే యువతకు అవకాశం కల్పించేదిగా ఉండాలని ఉత్తమ్ సూచించారు. అగ్నిపథ్ స్కీంతో ఎన్నో ఏళ్లుగా ఆర్మీలో చేరేందుకు ఎదురు చూస్తోన్న యువత తీవ్ర నిరాశకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీం అమలుపై పునరాలోచించాలని కోరారు.