ఫోర్బ్స్ టాప్ 20లో అదానీకి చోటు

ఫోర్బ్స్ టాప్ 20లో అదానీకి చోటు

న్యూఢిల్లీ: హిండెన్​బర్గ్​ రిపోర్ట్​ కారణంగా రూ.లక్షల కోట్లను నష్టపోయిన గౌతమ్​ అదానీ.. తన కంపెనీల షేర్లు పుంజుకోవడంతో సంపదను మళ్లీ పెంచుకుంటున్నారు.  ఈ ఏడాది జనవరి 17న ఆయన ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న వ్యక్తి. ఈ రిపోర్టు కారణంగా పోయినవారం టాప్– 20లో కూడా లేకుండాపోయారు. ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడటంతో మళ్లీ ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ప్రవేశించారు. ప్రస్తుతం 17వ ర్యాంకులో ఉన్నారు. తాజాగా మంగళవారం అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగిన తర్వాత, ఆయన నెట్​వర్త్​ 463 మిలియన్ డాలర్లు  (దాదాపు రూ.3,811 కోట్లు)ఎగిసింది. మెజారిటీ అదానీ గ్రూప్ స్టాక్‌‌‌‌లు మంగళవారం లాభాలను సంపాదించుకున్నాయి. అదానీ గ్రూప్ ఫ్లాగ్‌‌‌‌షిప్ అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ ఇంట్రాడేలో అప్పర్ సర్క్యూట్‌‌‌‌ను తాకి 14.63 శాతం పెరిగింది. నిఫ్టీ-50 స్టాక్స్‌‌‌‌లో ఈ స్టాక్ లీడ్ గెయినర్‌‌‌‌గా నిలిచింది.

డిసెంబర్ క్వార్టర్​లో లాభం తగ్గినప్పటికీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ (ఏపీఎస్ఈజెడ్) 1.33 శాతం లాభపడింది. అదానీ విల్మార్ 4.99 శాతం, ఏసీసీ 1.32 శాతం, అంబుజా సిమెంట్ 1.12 శాతం పెరిగాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 5 శాతం తగ్గింది. అదానీ ట్రాన్స్‌‌‌‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్,  అదానీ పవర్ కూడా పడిపోయాయి. యూఎస్​ షార్ట్ సెల్లర్ హిండెన్‌‌‌‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్​.. అదానీ గ్రూప్‌‌‌‌పై పలు ఆరోపణలు చేసింది. స్టాక్​ మానుప్యులేషన్​కు, మనీలాండరింగ్​కు, అకౌంటింగ్​ మోసాలకు పాల్పడ్డారని ఆరోపించింది. దీంతో అదానీ సంపద బాగా తగ్గింది. పోయిన కొన్ని వారాల్లో అదానీ గ్రూప్ స్టాక్‌‌‌‌లు 118 బిలియన్ల మార్కెట్ క్యాప్​ను కోల్పోయాయి.  ఇదిలా ఉంటే ఎలోన్ మస్క్ (3 బిలియన్ డాలర్లు), తదాషి యానై (708 మిలియన్ డాలర్లు), రవి జైపురియా (675 మిలియన్ డాలర్లు)  లో తక్వా క్వాంగ్ (648 మిలియన్ డాలర్లు) ఈ ఏడాది భారీగా సంపాదించారని ఫోర్బ్స్ తెలిపింది. 

అదానీ స్టాక్స్​పై 2019 నుంచే నిఘా

అదానీ గ్రూపుపై హిండన్​బర్గ్​గ్రూపు ఇటీవల పలు ఆరోపణలు చేసినప్పటికీ, ఈ కంపెనీ స్టాక్స్​పై 2019 నుంచే నిఘా ఉన్నట్టు స్టాక్​ మార్కెట్​ డేటా చూపిస్తోంది. కంపెనీ షేర్స్​వేగంగా పెరుగుతుండటంతో రెగ్యులేటర్లు కన్నేసి ఉంచారని తెలుస్తోంది. ధరల్లో భారీ మార్పులు, ప్రమోటర్ల షేర్లు తనఖాలో ఉండటంతో ఆరు కంపెనీ షేర్లను ‘అడిషనల్ సర్వైలెన్స్ మెకానిజం’లో ఉంచినట్టు సెబీ ఇటీవల కూడా ప్రకటించింది. అయితే అదానీ ఎపిసోడ్​ను మార్కెట్ రెగ్యులేటర్​ సెబీ పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.  సెబీ స్పందిస్తూ స్టాక్​ మార్కెట్ల ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని, ఇందుకు అవసరమైన  నిఘా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపింది. షేర్ల లావాదేవీల్లో ఎటువంటి అవకతవకలు జరిగినా గుర్తించే వ్యవస్థ ఉందని ప్రకటించింది.