రాబోయే తరాలు నిన్ను గుర్తుంచుకుంటాయ్‌: రైనాకు మోడీ మెచ్చుకోలు

రాబోయే తరాలు నిన్ను గుర్తుంచుకుంటాయ్‌: రైనాకు మోడీ మెచ్చుకోలు

న్యూఢిల్లీ: పంద్రాగస్టు రోజున టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతోపాటు డాషింగ్ లెఫ్టాండర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ప్లేయర్లు ఇండియన్ క్రికెట్‌కు చిరస్మరణీయ సేవలు అందించారు. ఈ నేపథ్యంలో వీరి సేవలను ప్రశంసిస్తూ అనేక మంది సెలబ్రిటీలు, మాజీ క్రీడాకారులు, రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ కూడా వీరి సేవలపై ట్విట్టర్‌‌ వేదికగా లేఖలు రాశారు. క్రికెట్‌కు రైనా అందించిన సేవలను మెచ్చుకుంటూ మోడీ రాసిన లేఖను ప్రధాన మంత్రి కార్యాలయం లెఫ్టాండర్‌‌కు పంపింది. ‘నువ్వు క్రికెట్‌ను శ్వాసించావ్, జీవించావ్. ఆటపై నీ ఆసక్తి జీవితపు తొలినాళ్లలోనే మొదలైంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడంలో అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌లోనూ నీ ప్రయాణం అద్వితీయం. తరాలు నిన్ను గుర్తు పెట్టుకుంటాయి. బ్యాట్స్‌మన్‌గానే కాక అవసరమైనప్పుడు కెప్టెన్‌కు పనికొచ్చే బౌలర్‌‌గానూ సేవలందించావ్. ఇక నీ ఫీల్డింగ్ అయితే అమోఘం, స్ఫూర్తిదాయకం. రీసెంట్‌ టైమ్స్‌లో ఫీల్డింగ్‌లో నీ ముద్ర చూపించావ్’ అని రైనాను మోడీ మెచ్చుకున్నారు. దీనిపై ట్విట్టర్‌‌ వేదికగా రైనా స్పందించాడు.

‘మేం ఆడేటప్పుడు దేశం కోసం మా రక్తాన్ని ధారపోస్తాం. స్వేదాన్ని చిందిస్తాం. ప్రజల నుంచి ప్రేమాభిమానాలు దక్కడానికి మించిన మెచ్చుకోళ్లు ఉండవు. దేశ ప్రధాని నుంచి ప్రశంసలు దక్కడానికి మించి ఏముంటుంది. అభినందనలు, శుభాకాంక్షలు చెప్పినందుకు పీఎం మోడీకి మప్పిదాలు. కృతజ్ఞతతో వాటిని స్వీకరిస్తున్నా. జై హింద్!’ అని రైనా ట్వీట్ చేశాడు.