గోదారిని గలీజ్ చేస్తున్నరు

గోదారిని గలీజ్ చేస్తున్నరు

బాసర నుంచి భద్రాద్రి దాకా నదిలోకి ఫ్యాక్టరీల కెమికల్​ వేస్టేజీ

టౌన్లు, పల్లెల డ్రైనేజీ నీళ్లూ అందులోనే.. 

తీరాలన్నీ డంపింగ్​ యార్డులే.. తాగడానికి పనికిరాని నీళ్లు

వరుసగా రెండేండ్లు వరద రాకుంటే చేపలూ బతకవు

పరిరక్షణకు సర్కారు చర్యలు శూన్యం.. ట్రీట్​మెంట్ ప్లాంట్లకూ దిక్కులేదు

వెలుగు, నెట్​వర్క్: గోదావరి నీళ్లన్నీ గలీజైతున్నయి. బాసర నుంచి మొదలు పెడితే భద్రాద్రి దాకా నదిలో వాటర్​ క్వాలిటీ ఘోరంగా దెబ్బతింటున్నది. నీళ్లు తాగడానికి పనికిరాకుండా తయారైతున్నయి. లిక్కర్​, విద్యుత్​, సిరామిక్స్​, పేపర్​ ఫ్యాక్టరీల వేస్టేజీతోపాటు సింగరేణి నుంచి వచ్చే కెమికల్​ వేస్టేజీ, వివిధ టౌన్లు, గ్రామాల నుంచి వచ్చే డ్రైనేజీ వాటర్ ను ఎలాంటి ట్రీట్​మెంట్​ చేయకుండా నేరుగా నదిలో కలుపుతున్నరు. నదికి ఇరువైపులా సర్కారే డంపింగ్​యార్డులు పెట్టి,  టన్నులకొద్దీ చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను కుప్పలుగా పోయిస్తున్నది. ఫలితంగా ఆయా ఏరియాల్లో గోదావరి నీళ్లు నల్ల రంగులోకి మారి, కంపు కొడుతున్నయి. ఈ నీళ్లను పశువులు కూడా తాగుతలేవు. ఎల్లంపల్లి రిజర్వాయర్​తో పాటు కాళేశ్వరంలో భాగంగా వివిధ బ్యారేజీలు నిర్మించాక, ఈ వ్యర్థాలన్నీ ప్రాజెక్టు నీళ్లలో పేరుకుపోతున్నయి.  నది పొడవునా వాటర్​లో ఆక్సిజన్​ లెవల్స్​ పడిపోయి  బీ గ్రేడ్​ నమోదవుతున్నది. రామగుండం ఇండస్ట్రియల్​ ఏరియాలోని కొన్ని పాయింట్లలో డీ గ్రేడ్​వస్తున్నది. ఇది అత్యంత ప్రమాదకరమని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వరుసగా రెండు మూడేండ్లపాటు వరద​రాకుంటే ఆ వాటర్​ను ట్రీట్​మెంట్ చేసినా తాగలేని పరిస్థితి ఉంటుందని, చేపలు కూడా బతకలేని పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు. రాష్ట్ర తాగునీటి అవసరాలకు కీలకమైన గోదావరి పరిరక్షణకు సర్కార్​ చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. 

అన్ని చోట్ల అదే పరిస్థితి

లీటర్​ నీటిలో డిసాల్వ్​డ్​ ఆక్సిజన్‌‌ (డీవో) లెవల్స్​ 6 మిల్లీగ్రాముల పైన ఉంటే దానిని ‘ఏ’ గ్రేడుగా, 5 మిల్లీ గ్రాములపైన ఉంటే ‘బీ’ గ్రేడుగా, 4 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ ఉంటే ‘సీ’ గ్రేడ్​గా, 4  మిల్లీగ్రాములు, అంత కన్నా తగ్గితే ఆ వాటర్​ను ‘డీ’ గ్రేడుగా  పరిగణిస్తారు. ఏ గ్రేడ్‌‌ నీళ్లను తాగొచ్చు. బీ గ్రేడ్‌‌ నీళ్లు తాగడానికి పనికిరావు. స్నానానికి మాత్రమే ఉపయోగించొచ్చు. సీ గ్రేడ్‌‌, డీ గ్రేడ్​ స్నానానికి కూడా పనికిరావు. రాష్ట్ర పొల్యూషన్​ కంట్రోల్ ​బోర్డు(టీపీసీబీ) ప్రతి నెలా గోదావరిపై 16 పాయింట్లలో వాటర్​ శాంపిల్స్​ తీసి టెస్టులు చేయిస్తున్నది. ఈ ఏడాది లెక్కల ప్రకారం గోదావరి నీళ్లలో డీవో లెవల్స్ ఆయా ఏరియాల్లో సగటున లీటర్​కు 5.5 మిల్లీగ్రాములు మించలేదు. అంటే ఈ నీళ్లు బీ గ్రేడ్​లో ఉన్నాయి. -స్నానానికి తప్ప తాగడానికి పనికిరావని పీవోబీ రిపోర్ట్​లో తేలింది. రామగుండం వద్ద సెప్టెంబర్​ నుంచి ఆక్సిజన్​ 4 మిల్లీగ్రాములగానే నమోదవుతున్నాయి. 

50కి పైగా నాలాల మురుగు
రాష్ట్రంలో గోదావరి సుమారు 400 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుండగా, ప్రధానంగా ఐదారుచోట్ల పొల్యూషన్​ఎఫెక్ట్​ తీవ్రంగా ఉంది. బాసర నుంచి భద్రాద్రి వరకు దాదాపు 50కిపైగా నాలాల్లోంచి రోజుకు కనీసం 200 ఎంఎల్‌‌‌‌డీ (మిలియన్​ లీటర్స్​ పర్​డే) మురుగునీటిని శుద్ధి చేయకుం డానే నదిలోకి వదులుతున్నారు. మహారాష్ట్ర ధర్మాబాద్ తాలూకాలోని లిక్కర్​​ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్స్ బాసర వద్ద గోదావరిలో కలవడంతో ఈ పొల్యూషన్ ప్రభా వం మొదలవుతున్నది. ఏడాదంతా నిల్వ ఉంచిన రసాయన వ్యర్థాలను కంపెనీలు వానాకాలంలో వదిలి పెడుతున్నాయి. దీంతో వరద బంద్​ కాగానే సుమారు 12 కిలోమీటర్ల మేర నది నురుగలతో నిండి విషపూరితమవుతున్నది. 

మురికి కూపంలా ధర్మపురి
జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో డ్రైనేజీ నీరంతా నేరుగా నదిలో కలవడంతో ఇప్పుడిక్కడ స్నానం అంటేనే భక్తులు భయపడుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్​వాటర్​తో డ్రైనేజీ నీళ్లన్నీ ధర్మపురి వైపు ఎగదన్ని మురికికూపంలా మారిపోయింది. ఇక రామగుండం కార్పొరేషన్​లోని 4 మెయిన్​నాలాలతో పాటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్​ఎఫ్​సీఎల్​ తదితర ఇండస్ట్రీస్​ నుంచి రోజూ 44 మిలియన్‌‌‌‌ లీటర్ల మురుగు నీరు నదిలో కలుస్తున్నది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, మంచిర్యాల, నస్పూర్​, చెన్నూర్​ మున్సిపాలిటీల నుంచి వచ్చే డ్రైనేజీ వాటర్​ను శుద్ధి చేయకుండా వదులుతున్నారు. ఒక్క మంచిర్యాల మున్సిపాలిటీ నుంచే 25.02 ఎంఎల్‌‌డీల మురుగు నీరు రాళ్లవాగు ద్వారా నేరుగా గోదావరిలోకి చేరుతున్నది. ఈ మున్సిపాలిటీకి గోదావరే డంప్ ​యార్డుగా మారింది. పట్టణం నుంచి రోజూ వెలువడే 50 టన్నుల చెత్తను నదిలోనే డంప్​ చేస్తున్నారు. బొగ్గుబావులతో పాటు పవర్​ ప్లాంట్లు, సిరామిక్స్​ పరిశ్రమలు, ఓపెన్ ​కాస్ట్​ ప్రాజెక్టుల నుంచి వచ్చే కెమికల్​వేస్టేజీని నేరుగా నదిలోనే వదులుతున్నారు. జంతువుల కళేబరాలు, హాస్పిటళ్ల నుంచి వెలువడే బయోమెడికల్​ వేస్టేజ్​ కూడా గోదావరిలోనే పడేస్తున్నారు. ఇక భద్రాచలం ఎగువన ఐటీసీ పేపర్​ ఇండస్ట్రీతోపాటు వివిధ పరిశ్రమల నుంచి పెద్దమొత్తంలో వ్యర్థాలను  నదిలోకే వదులుతున్నాయి. ఐటీసీలో పేపర్​ తయారీకి 40 రకాల రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఫలితంగా తెల్లని నురగరూపంలోని కెమికల్స్​ తాళ్లగొమ్మూరు వద్ద నేరుగా గోదావరిలో కలుస్తున్నాయి. వీటికి తోడు భద్రాచలం పట్టణంలోని మెయిన్​ డ్రైన్​ను కూడా నదిలోకే మళ్లిస్తున్నారు.

సీవరేజీ ప్లాంట్లు మూత
నేషనల్‌‌‌‌ రివర్‌‌‌‌ కన్జర్వేషన్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ (ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌సీపీ) స్కీం కింద రూ. 34.19 కోట్ల తో మంచిర్యాల, రామగుండం, భద్రాచలం సమీపంలో సీవరేజీ ప్లాంట్లు నిర్మించినా నిర్వహణ లేక మూతపడ్డాయి. రామగుండం కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో 2005లో రామగుండం, మల్కాపూర్‌‌‌‌, సుందిళ్ల వద్ద సీవరేజ్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లాంట్ల(ఎస్​టీపీ)ను నిర్మించగా.. 2011 వరకు పనిచేశాయి. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో మూలనపడ్డాయి. సింగరేణి  మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ రూ.17 కోట్లతో జీడీకే 2వ గని సమీపంలో ఎస్‌‌‌‌టీపీ నిర్మించడానికి ముందుకు వచ్చింది. రామగుండం ఎన్టీపీసీ సహకారంతో మల్కాపూర్‌‌‌‌ వద్ద మరో ఎస్టీపీ నిర్మించడానికి కార్పొరేషన్ ప్రయత్నించగా, ఈ రెండు ఇంకా ప్రపోజల్స్​దశలోనే ఉన్నాయి. ఈ ప్రక్రియను స్పీడప్​ చేయించేందుకు అటు సర్కారుగానీ, ఇటు పీవోబీ ఆఫీసర్లు గానీ చర్యలు తీసుకోవట్లేదు.

ఎస్టీపీలు నిర్మించాలి
గోదావరిలో మంచిర్యాల నుంచి సుందిళ్లదాకా  నీళ్లు పొల్యూట్ అవుతున్నయి. ఎన్టీపీసీ నుంచి కెమెకిల్స్​తో​ ​పాటు బొగ్గును మండిస్తే వచ్చే బూడిదనూ గోదావరిలో కలుపుతున్నరు. ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ ఫ్యాక్టరీ వాటర్‌‌‌‌ గోదావరిలోనే కలుస్తున్నది. రామగుండం కార్పొరేషన్​ నుంచి వచ్చే మురుగునీరు శుద్ధి చేయకుండా నేరుగా కలుపుతున్నారు.  దీంతో నదిలో నీరు తాగడానికి పనికిరాకుండా పోతున్నాయి. ఇక్కడి నాలాలపై, సీవరేజ్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లాంట్లు(ఎస్​టీపీల)పెట్టి శుద్ధి చేయాలె. 
‒ దహగామ ఉమామహేశ్వర్‌‌‌‌, పర్యావరణవేత్త

ఇప్పటికైనా మేల్కోవాలి
గోదావరి విషయంలో ప్రభుత్వాలు రూల్స్​కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. నదుల ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకునేలా ప్రాజెక్టులు కట్టరాదని, నదుల్లో ఎప్పుడూ 5శాతం నీటి ప్రవాహం ఉండేలా చూడాలనే రూల్​ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మేల్కోకపోతే రానున్న రోజుల్లో గోదావరి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. 
- కె.వి.ప్రతాప్​, గోదావరి పరిరక్షణ సమితి స్టేట్​ కన్వీనర్​

పశువులు కూడా తాగుతలేవు
ఒకప్పుడు గోదావరి నీళ్లు ఎంతో తేటగా ఉండేవి. కానీ ఫ్యాక్టరీల వేస్టేజీ, డ్రైనేజీ వాటర్​ నేరుగా కలవడంతో నీళ్లన్నీ నల్లగా మారుతున్నాయి. గలీజు వాసన  వస్తున్నాయి. ఈ నీళ్లను పశువులు కూడా తాగుతలేవు. భద్రాద్రి ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఇక్కడ స్నానం చేయాలంటే భయపడుతున్నారు. ఈ నీళ్లతో స్నానం చేస్తే  చర్మ వ్యాధులు వస్తున్నాయి. 
- పేరాల రాములు, బూర్గంపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా