భూపేన్ హజారికాను డూడుల్ తో స్మరించుకున్న గూగుల్

భూపేన్ హజారికాను డూడుల్ తో స్మరించుకున్న గూగుల్

‘భారత రత్న’ భూపేన్ హజారికా గురించి ఎంత చెప్పినా తక్కువే. గాయకుడు, కళాకారుడు, నటుడు, చిత్ర నిర్మాత, సంగీత విద్వాంసుడు, కవి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సంపాదించిన ఆయనను ఇవాళ (గురువారం) 96వ జయంతి సందర్భంగా గూగుల్ గౌరవించింది. హజారికాను గుర్తుకు చేసుకుంటూ ప్రత్యేకమైన డూడుల్ ను గూగుల్ హోం పేజీలో ప్రదర్శించింది.

హార్మోనియం వాయిస్తూ, పాట పాడుతున్నట్లుగా భూపేన్ హజారికా ఉన్న డూడుల్ నెటిజన్లను అలరిస్తోంది.. ఆలోచింపజేస్తోంది.  వివిధ రంగాల్లో దేశానికి ఆయన అందించిన సేవలను తెలుసుకోవాలనే కుతూహలాన్ని అందరిలో రేకెత్తిస్తోంది. ఈ క్రియేటివ్ డూడుల్ ను ముంబైకి చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ రుతుజా మాలీ గీశారని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. 

హజారికా జీవిత ప్రస్థానం, విజయాలు..

  • భూపేన్ హజారికా 1926 సెప్టెంబరు 8న అస్సాంలోని సదియా ప్రాంతంలో జన్మించారు. ఇంట్లోని 10 మంది పిల్లల్లో భూపేనే పెద్దవాడు. 
  • పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు.. 12 ఏళ్ల వయసు నుంచే భూపేన్ రెండు సినిమాల (ఇంద్రమాలతి : కక్సోటే కోలోసీ లోయి, బిస్వో బిజోయి నౌజవాన్) కోసం పాటలు రాశారు, పాడారు. 
  • భూపేన్ హజారికా అస్సామీస్ సినీ రంగానికి, జాపనద సంగీతానికి అందించిన సేవలు ఎనలేనివి. 
  • 1975 సంవత్సరంలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ విభాగంలో జాతీయ అవార్డును ఆయన దక్కించుకున్నారు. 
  • 1987లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. 
  • 1992లో దాదాసాహెబ్ పాల్కే అవార్డును ఆయన పొందారు. 
  • 2011 నవంబరు 5న భూపేన్  కన్నుమూశారు. 
  • మరణానంతరం 2012 సంవత్సరంలో ఆయనకు పద్మ విభూషణ్ ప్రకటించారు. 2019లో భారత రత్న ప్రకటించారు.