V6 News

ప్రజలకు నష్టమని తెలిసినా సర్కారు పట్టించుకోవట్లే : కోదండరాం

ప్రజలకు నష్టమని తెలిసినా సర్కారు పట్టించుకోవట్లే : కోదండరాం

మరికల్, వెలుగు: ఇథనాల్​ కంపెనీ వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని టీజేఎస్​రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మరికల్​మండలంలోని చిత్తనూర్​గ్రామంలో జూరాల ఆగ్రో బయో కంపెనీ వ్యతిరేక పోరాట సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. కంపెనీ నిర్మాణం పూర్తయితే దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయని గ్రామస్తులకు వివరించారు. దీనిని మొదట్లోనే అడ్డుకోవాలన్నారు. కోయిల్​సాగర్​ప్రాజెక్టు నీటితో పచ్చదనంతో పంటలు మెరుస్తుంటే కంపెనీ వారికి మింగుడు పడడం లేదా అని ప్రశ్నించారు. 

కంపెనీ ఏర్పాటైతే గాలి, తాగు, సాగునీరు అన్నీ కలుషితమైపోతాయన్నారు. కంపెనీ మూతపడేవరకు ఐకమత్యంతో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్తుల న్యాయ పోరాటానికి టీజేఎస్​మద్దతు ఉంటుందన్నారు. ఈ నెల 30న హైదరాబాద్​లోని సుందరయ్య భవన్​లో రౌండ్​టేబుల్​సమావేశం ఉందని, దీనికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. సమావేశంలో పలు సంఘాల నేతలు రాఘవచారి, చంద్రశేఖర్, వెంకట్రాములు, లక్ష్మయ్య, సుదర్శన్, ఖాదర్, వెంకట్​రెడ్డి, యువక మండలి మురళి, మణివర్ధన్​ పాల్గొన్నారు.