V6 News

మహిళా బిల్లుపై బీజేపీ నాటకాలు బయటపడ్డయ్ : మంత్రి పొన్నం ప్రభాకర్

మహిళా బిల్లుపై బీజేపీ నాటకాలు బయటపడ్డయ్ : మంత్రి పొన్నం ప్రభాకర్

బీజేపీ తీరుపై  మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ నాటకాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయని ఆయన విమర్శించారు. మహిళా బిల్లు విషయంలో బీజేపీ చిత్తశుద్ధిని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళలకు ప్రాధాన్యతనిస్తూ, మహిళా బిల్లుకు పూర్తి సహకారాన్ని అందించిందని.. కానీ బీజేపీ మాత్రం పచ్చి మనువాద పార్టీలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కుట్రపూరితంగా మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో లింక్ పెట్టి పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీ మహిళలను జాతీయ అధ్యక్షురాలిగా నియమించిందని గుర్తు చేసిన మంత్రి.. ఇప్పటి వరకు ఒక్క మహిళకైనా బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చిందా అని నిలదీశారు. బీజేపీకి మహిళా సాధికారతపై ఉన్న ప్రేమ కేవలం మాటలకే పరిమితమని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీల వ్యాఖ్యలను ఆయన దుర్మార్గమైనవిగా అభివర్ణించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయమంటే కిషన్ రెడ్డి పారిపోయారని.. తెలంగాణ ప్రజలను అవమానించినందుకు బీజేపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తేజస్వి సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తక్షణమే తొలగించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రస్తుత డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా బిల్లును స్వతంత్రంగా ప్రవేశపెడితే దానిని పాస్ చేయించే బాధ్యతను కాంగ్రెస్ ముందుండి తీసుకుంటుందని  స్పష్టం చేశారు.