జీవోలిచ్చారు.. మార్పులు మరిచారు

జీవోలిచ్చారు.. మార్పులు మరిచారు
  • పండిట్, పీఈటీల అప్​గ్రేడ్ పై సర్కారు నిర్లక్ష్యం
  • పాత జీవోల సవరణను పట్టించుకోని ప్రభుత్వం
  • అమలు కాని సీఎం హామీ
  • ఆశగా ఎదురుచూస్తున్న 10,480 మంది పండిట్, పీఈటీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్​గ్రేడ్ చేయడంపై కొత్త జీవోలు ఇచ్చినా..  పాత జీవోలు సవరించకపోవడంతో ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో వీరిని అప్​గ్రేడ్​ చేస్తామని మూడేండ్ల కింద సర్కారు ఇచ్చిన హామీ అమలులోకి రావడం లేదు. మరోవైపు పాత జీవోల్ని మార్చాలన్న రిక్వెస్ట్​ను పట్టించుకోవడం లేదు. సర్కారు, లోకల్ బాడీ స్కూళ్లలో పనిచేస్తున్న పండిట్లు, పీఈటీలకు ప్రస్తుతం ఎస్జీటీలుగా గుర్తింపు ఉంది. అయితే తెలుగు, హిందీ, ఉర్దూ తదితర లాంగ్వేజీ పండిట్లు హైస్కూల్ ​స్టూడెంట్లకు పాఠాలు చెప్తున్నారు. తమకు స్కూల్ అసిస్టెంట్ హోదా ఇవ్వాలని చాలాసార్లు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటి వరకు లాంగ్వేజీ పండిట్లు, పీఈటీలకు ఇతర ఎస్జీటీలతో కలిపి ప్రమోషన్లు ఇస్తున్నారు. దీనివల్ల ప్రత్యేక శిక్షణ తీసుకున్న తమకు గుర్తింపు లేకుండా పోతుందని ట్రిబ్యునల్​ను ఆశ్రయించారు. దీంతో భవిష్యత్​లో జరిగే లాంగ్వేజీ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లలో పండిట్లకే ప్రమోషన్లు ఇవ్వాలని ట్రిబ్యునల్ అప్పట్లో తీర్పునిచ్చింది.

10,480 మందిని అప్​గ్రేడ్ చేసినా…

2017లో హైదరాబాద్​లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో లాంగ్వేజీ పండిట్లకు ప్రమోషన్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2017, 2019లో రెండు విడతల్లో మొత్తం10,480 పోస్టులతో సహా పండిట్, పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్​గ్రేడ్ చేశారు. దీంట్లో 8,630 మంది పండిట్లు, 1,850 మంది పీఈటీలు న్నారు. అయితే ముందు 2017లో జీవోనెంబర్లు 17,18 ద్వారా 2,487 గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– 2 భాషా పండిట్, 1,047 పీఈటీ పోస్టులను మాత్రమే అప్​గ్రేడ్ చేయగా, 2019లో మాత్రం జీవో–15 ద్వారా 6,143 పండిట్, 803 పీఈటీలను అప్​గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రమోషన్లకు అడ్డుగా ఉన్న జీవోలను మాత్రం మార్చలేదు.

కోర్టు సూచించినా సవరించలే..

పండిట్, పీఈటీలను ఎస్ఏలుగా అప్​గ్రేడ్ చేయడం జీవోనెంబర్11,12లకు విరుద్ధమని కొందరు ఎస్జీటీలు కోర్టును ఆశ్రయించారు. ఆ జీవోల ప్రకారం డిగ్రీలో సంబంధిత లాంగ్వేజీని మెయిన్ సబ్జెక్టుగా చదివిన వారందరికీ స్కూల్ అసిస్టెంట్లగా ప్రమోషన్లు ఇవ్వొచ్చు. దీని ప్రకారం ఎస్జీటీలూ ఆయా పోస్టులకు అర్హులు. కానీ ప్రభుత్వం ఆ జీవోలను సవరించకుండానే జీవో నెంబర్ 17,18తో పాటు 15ను రిలీజ్ చేసింది. అయితే రెండు సందర్భాల్లోనూ పాత జీవోలు 11,12 సవరించి, ఆయా పోస్టులను అప్​గ్రేడ్ చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. సర్కారు మాత్రం ఆ జీవోలను సవరించడం లేదు. దీంతో 10,480 మంది సర్కారు సవరణ ఉత్తర్వుల కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు.

సీఎం మాటకే విలువలేదా

పండిట్లకు ప్రమోషన్లు ఇస్తానని తెలుగు మహాసభల్లో  సీఎం కేసీఆర్  హామీ ఇచ్చారు. 10,480 మందిని అప్ గ్రేడ్ చేస్తున్నట్టు జీవోలు ఇచ్చారు. కానీ ప్రమోషన్లకు అడ్డుగా ఉన్న పాత జీవోలు 11,12లను సవరించలేదు. దీంతో అప్​గ్రేడ్ చేసినా యూజ్ లేకుండా పోయింది. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని, వెంటనే పండిట్లను అప్​గ్రేడ్ చేయాలి. – సి.జగదీశ్, ఆర్​యూపీపీ స్టేట్ ప్రెసిడెంట్