సర్కారు ఆఫీసులు.. ప్రాపర్టీ ట్యాక్స్ కడ్తలె

సర్కారు ఆఫీసులు..  ప్రాపర్టీ ట్యాక్స్ కడ్తలె

హైదరాబాద్, వెలుగు  : జీహెచ్ఎంసీకి రాష్ర్ట ప్రభుత్వ శాఖలు ప్రాపర్టీ ట్యాక్స్ కడ్తలేవని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆఫీసులపై ఇప్పటి వరకూ  రూ.5,560 కోట్ల బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర శాఖలు రూ.371 కోట్ల బకాయిలున్నాయని చెప్పారు. ఈ ట్యాక్స్ లు వసూలు కానందునే జీహెచ్ఎంసీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని వివరించారు.  బుధవారం సీఎస్ శాంతికుమారికి  పద్మనాభరెడ్డి లెటర్ రాశారు.  గత నెలలో సిటీలోని 7లక్షల మంది రూ.786.75 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ కడితే అవి కార్పొరేషన్ ఉద్యోగుల జీతాలకే సరిపోయిందని పద్మనాభరెడ్డి తన లెఖలో తెలిపారు.

ఇక నాలాలు, రోడ్ల డెవలప్ మెంట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీపై రాష్ర్ట ప్రభుత్వం కక్ష కట్టిందని నిధులు విడుదల చేయకుండా అప్పులు తెచ్చేలా ప్రొత్సహిస్తోందని తెలిపారు. తెచ్చిన అప్పులకు జీహెచ్ఎంసీ రోజుకు రూ.2 కోట్ల వడ్డీ చెల్లిస్తుందని గుర్తు చేశారు. రాష్ర్ట ప్రభుత్వానికి వసూలయ్యే ట్యాక్స్ లో 80 శాతం హైదరాబాద్ నుంచే వసూలవుతున్నాయని, కేటాయింపులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని పద్మనాభరెడ్డి తెలిపారు. కనీసం ప్రాపర్టీ ట్యాక్స్ వసూలయ్యేలా శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. వర్షాలతో సిటీ అతలాకుతలం అయ్యిందని, పలువురు మరణించిందనా నాలాల అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు.