ఓదెల స్టేషన్​లో రైళ్ల హాల్టింగ్

ఓదెల స్టేషన్​లో రైళ్ల హాల్టింగ్
  • ఓదెల స్టేషన్​లో రైళ్ల హాల్టింగ్
  • ఈ నెల 8 నుంచి ఆగనున్న రామగిరి ప్యాసింజర్, కాగజ్​నగర్ ​సూపర్​ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ 
  • హాల్టింగ్ పై గత నెల రైల్వే మంత్రి వైష్ణవ్​ను కలిసిన వివేక్ వెంకటస్వామి


హైదరాబాద్/ పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్​లో పలు ట్రైన్లకు హాల్టింగ్ ఇస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సౌత్ ​సెంట్రల్ ​రైల్వేకు అధికారిక ఉత్తర్వులు అందాయి. 17003/17004 రామగిరి ప్యాసింజర్ (సికింద్రాబాద్–కాగజ్ నగర్), 17035/17036 కాగజ్​నగర్​సూపర్​ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (ఖాజీపేట నుంచి బల్హార్ష)కు ఓదెల స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. ఈనెల 8 నుంచి అక్కడ ట్రైన్లు ఆగనున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్​కు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ ​వెంకటస్వామి ధన్యవాదాలు తెలిపారు. ఓదెల స్టేష్ న్​లో రైళ్లు నిలిచేలా కృషి చేయాలని ఓదెల మండలం, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఇటీవల వివేక్​ని కోరారు. దీంతో ఆయన ఈ స్టేషన్ లో ట్రైన్స్ హాల్టింగ్​కు అవకాశం ఇవ్వాలని జనవరి 31న అశ్వినీ వైష్ణవ్​ను కలిసి వినతిపత్రం అందజేశారు.

పెద్దపల్లి జిల్లాలో ఓదెల మండల కేంద్రంతో పాటు కీలక స్టేషన్ అని, ఇక్కడి మల్లికార్జున స్వామి టెంపుల్ ఫేమస్ అని, ఏటా సమ్మర్​లో తెలంగాణ, ఏపీల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని కేంద్ర మంత్రికి వివరించారు. కరోనాకు ముందు ఈ స్టేషన్ లో రైళ్లకు హాల్టింగ్ ఉందని, కరోనా టైమ్ లో వాటిని స్పెషల్ ట్రైన్లుగా మార్చి హాల్టింగ్ తొలగించారని గుర్తు చేశారు. ఇదే విషయంపై సౌత్​ సెంట్రల్ ​రైల్వే జీఎంకు కూడా గతంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అశ్విన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 8 నుంచి మెమూ పుష్పుల్ రైలు (ఖాజీపేట నుంచి సిర్పూర్)తో పాటు రామగిరి, కాగజ్​నగర్​ సూపర్​ ఫాస్ట్​ఎక్స్​ప్రెస్​ ట్రైన్లను ఓదెలలో ఆగేలా ఆదేశాలు ఇచ్చారు. దీనిపై స్పందించిన పెద్దపల్లి, ఓదెల మండల ప్రజలు వివేక్​కు కృతజ్ఞతలు తెలిపారు.