డేంజర్​గా గాలి: ఢిల్లీలో హెల్త్​  ఎమర్జెన్సీ

డేంజర్​గా గాలి:  ఢిల్లీలో హెల్త్​  ఎమర్జెన్సీ

50 లక్షల మాస్క్​ల పంపిణీ     
నిర్మాణ పనులపై సర్కారు బ్యాన్​     
ఈ నెల 5 వరకూ స్కూళ్లు బంద్
అవసరమైతే స్కూళ్ల  సెలవులు పొడిగిస్తామన్న ప్రభుత్వం
ఉపిరితిత్తుల పేషంట్లతో హాస్పిటల్స్​ కిటకిట

గాలిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో ఢిల్లీ, ఎన్​సీఆర్​ రీజియన్​లో పబ్లిక్​ హెల్త్​ ఎమర్జెన్సీ ప్రకటించారు. నిర్మాణ పనులపై ఈ నెల 5 వరకు బ్యాన్​ విధించారు. ఈ వింటర్​ సీజన్​లో బాణాసంచా కాల్చొద్దన్నారు. సుప్రీంకోర్టు ప్యానల్ ​శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. గురువారం రాత్రి పొల్యూషన్​ లెవెల్స్ అత్యంత​ ప్రమాదకర స్థాయికి చేరాయని ఎన్విరాన్​మెంట్​ పొల్యూషన్ ప్రివెన్షన్​అండ్​ కంట్రోల్(ఈపీసీఏ) చైర్​పర్సన్​ భూరె లాల్​ చెప్పారు.  ఆరోగ్యంపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా చిన్న పిల్లలపై మరీ ఎక్కువని హెచ్చరించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్​ సర్కారు స్కూళ్లకు ఈ నెల 5 వరకు సెలవులు ప్రకటించింది. కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం కేజ్రీవాల్​ 50 లక్షల పొల్యూషన్​ మాస్కులు ఉచితంగా పంచారు.

గ్యాస్​చాంబర్​లా మారింది..

ఢిల్లీలో కాలుష్యానికి చుట్టూ ఉన్న ఇతర రాష్ట్రాలే కారణమని కేజ్రీవాల్​ ఆరోపించారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని పంటపొలాల్లో రైతులు వ్యర్థాలను తగలబెడుతున్నారని, వెహికిల్ పొల్యూషన్​కు ఇది కూడా తోడవడంతో ఢిల్లీ గ్యాస్​ చాంబర్​లా మారిందన్నారు. పొలాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టాలంటూ పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు రైతులపై ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. దీనిని ఆపేయాలంటూ పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులకు లెటర్​ రాయాలని స్కూల్​ స్టూడెంట్లకు కేజ్రీవాల్​ పిలుపునిచ్చారు. విషతుల్యమైన గాలి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని, పొల్యూషన్​ మాస్కులు ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.

నార్తర్న్​ రీజియన్​లో వాయు పీడన పరిస్థితులు ఏర్పడడంతో గాలి వేగం పెరుగుతోందని, శనివారం నాటికి కాలుష్య తీవ్రత గణనీయంగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

డాక్టర్ల వార్నింగ్​తో పిల్లల ఆరోగ్యంపై పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఎయిర్​ క్వాలిటీ మెరుగుపడేదాకా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని ట్విట్టర్లో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

అవసరాన్ని బట్టి స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా ఇప్పటికే ప్రకటించారు.. మంగళవారం నాటికీ పరిస్థితి మెరుగుపడకపోతే సెలవులు పొడిగిస్తామని చెప్పారు.

తొమ్మిది కంపెనీలకు ఫైన్

గ్రేటర్​ నోయిడాలో నిర్మాణ పనులతో వాయుకాలుష్యానికి కారణమైన తొమ్మిది సంస్థలకు యూపీ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డ్​ రూ.5.25 లక్షల జరిమానా విధించింది. ఇందులో ప్రభుత్వ సంస్థ డీఎఫ్ సీసీఐఎల్, ఎల్​అండ్​ టీ కి ఉమ్మడిగా రూ.50 వేలు ఫైన్​ వేసింది.

ఎయిర్​ క్వాలిటీ ఎట్లుంది?

శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్​ క్వాలిటీ 425 పాయింట్లుగా నమోదైందని సిస్టం ఆఫ్ ఎయిర్​ క్వాలిటీ అండ్​ వెదర్​ ఫోర్ ​కాస్టింగ్​ అండ్​ రీసెర్చ్(సఫర్) వెల్లడించింది. ఢిల్లీ మొత్తానికి బావానా ప్రాంతమే అత్యంత కాలుష్యకారకమని, ఇక్కడ ఎయిర్​ క్వాలిటీ 716 పాయింట్లుగా రికార్డైందని అధికారులు చెప్పారు.