ఈ ఏడాదిలోనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం

ఈ ఏడాదిలోనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం

ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఆయన ఇవాళ వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి పరిగిలో స్థానిక ఎమ్మెల్యే అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. 9200 గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్ ఈ నెలలో ఉంటుందన్నారు. అందరూ అన్ని పోస్టులకు పరీక్ష రాసేందుకు వీలుగా ఒక దాని తర్వాత మరొక నోటిఫికేషన్ ఇస్తున్నామని తెలిపారు. 

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను ఈ సంవత్సరంలో భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశారు. పట్టు బట్టి, ఢిల్లీ పోయి కేంద్రాన్ని ఒప్పించారని హరీష్ వ్యాఖ్యనించారు. 33 శాతం పోలీసు ఉద్యోగాలు మహిళలకు కల్పించారు సీఎం కేసీఆర్ అని మంత్రి వెల్లడించారు. మొన్న సివిల్స్ లో ర్యాంకులు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. లక్ష్యం సిద్ధించాలంటే, చిత్తశుద్దితో పని చేయాలన్నారు. బాగా చదివి తల్లిదండ్రుల పేరు తేవాలని..వారి ఆశలు నిలబెట్టాలని మంత్రి హరీష్ రావు విద్యార్థులకు వివరించారు.