సాదారణంగా పిల్లలు వెజిటబుల్స్ తినాలంటే కొంచెం మారాం చేస్తారు. కానీ, పిల్లలకు సంపూర్ణ పోషకాలు అందాలంటే వెజిటబుల్ కిచిడి పెట్టాల్సిందే. అంతేకాదు తక్కువ మసాలాలతో చేసుకునే కిచిడీలు అన్ని వయసుల వాళ్లకు మంచిది. పైగా సులభంగా అరుగుతుంది కూడా. ఎంతో రుచికరమైన వెజిటబుల్ టేస్టీ కిచిడీలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
స్పైసీ సాబుదాన కిచిడి తయారీకి కావలసినవి
- సగ్గుబియ్యం : ఒక కప్పు
- ఆలుగడ్డలు : రెండు
- పల్లీలు అరకప్పు
- అల్లం తరుగు - ఒక టీస్పూన్
- పచ్చిమిర్చి- రెండ
- పచ్చి కొబ్బరి తురుము- పావు కప్పు
- నూనె : రెండు టేబుల్ స్పూన్లు
- చక్కెర - అర టీస్పూన్
- ఉప్పు: తగినంత
స్పైసీ సాబుదాన కిచిడి తయారీ విధానం
సగ్గు బియ్యాన్ని ముందు రోజురాత్రి నానబెట్టాలి. తర్వాత ఆలుగడ్డలు ఉడికించి ముక్కలుగా చేయాలి.పల్లీలు వేగించి పొడి చేయాలి. ఈ పొడిలో చక్కెర, ఉప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కలిపి పక్కన పెట్టాలి.
ఒక పాన్ లో నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగాక, అల్లం తరుగు కూడా వేసి వేగించాలి. బాగా వేగిన తర్వాత అలుగడ్డ ముక్కలు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత సగ్గుబియ్యం వేసి కలుపుతూ ఉండాలి.
సగ్గుబియ్యం ఉడికిన తర్వాత వచ్చి కొబ్బరి తురుము వేసి ఒకసారి కలిపి దించేయాలి. వేగించిన పల్లీలతో గార్నిష్ చేయాలి
వెజ్ మసాలా కిచిడి తయారీకి కావలసినవి
- బియ్యం :అర కప్పు
- పెసరపప్పు :అర కప్పు
- నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు
- జీలకర్ర : అర టీస్పూన్
- బిర్యానీ ఆకు: ఒకటి
- యాలకులు: రెండు
- లవంగాలు: రెండు
- దాల్చిన చెక్క: కొంచెం
- ఉల్లిపాయ తరుగు: అరకప్పు
- టొమాటా తరుగు అరకప్పు
- అల్లం, వెల్లుల్లి పేస్ట్: ఒక టీ స్పూన్
- పచ్చి మిర్చి : ఆరు
- కూరగాయల ముక్కలు( తరిగినవి): ఒక కప్పు
- పసుపు :పావు టీస్పూన్
- కారం : పావు టీస్పూన్
- ఇంగువ : కొంచెం
- కొత్తిమీర తరుగు: ఒక టీస్పూన్
- నీళ్లు, ఉప్పు: సరిపడ
వెజ్ మసాలా కిచిడి తయారీ విధానం
కుక్కర్లో నెయ్యి వేడి చేసి మసాలా దినుసులన్నీ వేసి వేగించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి వేగించాలి.
తర్వాత టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి రెండు నిమిషాల వేగించి, కూరగాయల ముక్కలు పసుపు. కారం, ఇంగువ కూడా వేసి ఉడికించాలి.
రెండు నిమిషాలు తర్వాత బియ్యం, పెసరపప్పు, ఉప్పు వేసి కలిపి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టౌ నుంచి దించేయాలి. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
