బెడ్డు ఎక్కినమా.. ముసుగు తన్ని పండినమా.. పొద్దున్నే లేచినమా! రోజూ చేసే పనుల్లో ఇదొక పని. మంచిగా బజ్జోపెట్టే బెడ్డే సిన్మా చూపిస్తే ఎట్లుంటది! హాయిగ నడుం వాల్చి నచ్చిన సిన్మాలు చూసేస్తే ఎట్లుంటది! ఇగో అట్లాంటి ‘టీవీ మంచాన్ని’ తయారు చేసిండు ఫేబియో వినెల్లా అనే ఆర్కిటెక్ట్. ఇటలీ ఫర్నీచర్ కంపెనీ హై ఇంటీరియర్ కోసం ‘హైబెడ్’ అనే ఈ కొత్త టీవీబెడ్డుకు డిజైన్ చేసిండు. 70 అంగుళాల స్క్రీన్ కలిగిన 4కే ప్రొజెక్టర్‌ను మంచానికి పెట్టిండు. ఆ మంచం చుట్టుముట్టు స్పీకర్లు కూడా పెట్టిండు. ఈ టీవీ మంచం కోసం ఓ స్పెషల్ యాప్‌నూ సృష్టించిండు ఫేబియో.
అరె ఎప్పుడూ సినిమా చూసుకుంటనే కూసోమంటరా ఏంది.. పండుకునుడొద్దా, మా నిద్రలేమైపోవాలె అని గుస్స కాకున్రి. ఎందుకంటే, దాని మీద పడుకునేటోళ్ల నిద్రను ఈ స్మార్ట్ టీవీ బెడ్డు ఎప్పటికప్పుడు సరిచూసుకుంటది. మనల్ని ఎప్పటికప్పుడు నువ్వు సరిగ్గ నిద్ర పోలె అని చెప్తది. అక్కడితో అయిపోలేదు, రూంల వేడెట్లుంది.. గాలి మంచిగుందా, సౌండ్ పెద్దగుందా..చిన్నగుందా వంటి వాటిని ఎప్పటికప్పుడు చూసుకుంటది. రాత్రిపూట బెడ్‌లైట్ అవసరం లేకుండా ఆ బెడ్డే బెడ్‌లైట్ అయితది. చదువడానికి రీడింగ్ లైట్నిస్తది. పొద్దున్నే నిద్ర లేపడానికి అలారం మోగిస్తది. రోజూ వాతావరణ వివరాలు చెప్తది, వార్తలేంటో చదివి వినిపిస్తది. ఇంతకంటే ఏం కావాలె. ఒక్క బెడ్డు, మస్తు పనులు, మస్తు ఉపయోగాలు! బాగుంది కదా టీవీ మంచం!
