హీరోలకేనా.. నేతలకు వద్దా?.. డ్రగ్ టెస్ట్‌పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మంచు విష్ణు కౌంటర్!

హీరోలకేనా.. నేతలకు వద్దా?..  డ్రగ్ టెస్ట్‌పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మంచు విష్ణు కౌంటర్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్.  గతంలో పలువురిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సినిమా వాళ్లకు డ్రగ్స్ టెస్టులు చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.  దీనిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్‌ ఇవ్వడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. పబ్లిక్ లైఫ్‌లో ఉండేవారికి జవాబుదారీతనం ఎంతవరకు ఉండాలి? అనే అంశంపై ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.

 అనిరుధ్ రెడ్డి ప్రతిపాదన ఏమిటి?

ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, సినీ హీరోలకు డ్రగ్ టెస్టులు తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి అగ్ర నటులు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని, వారి సినిమా విడుదలకు ముందు ఈ రిపోర్టులు బయట పెట్టాలని సూచించారు.  తెలంగాణలో మారకద్రవ్యాల వాడకాన్ని అరికట్టడానికి ఇలాంటి చర్యలు సహాయయపడతాయని పేర్కొన్నారు

సినిమా ఇండస్ట్రీలోనే డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంటుందని సామాన్య ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉంది. నటులు సమాజంపై, ముఖ్యంగా యువతపై అపారమైన ప్రభావం చూపుతారు. వారు డ్రగ్ టెస్ట్ చేయించుకుంటే, తమ హీరో డ్రగ్ అడిక్ట్ కాదని అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. నేను స్వయంగా డ్రగ్ టెస్ట్ చేయించుకున్నాను, వీరికి ఇబ్బంది ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.

మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్

అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘాటుగా స్పందించారు.  కేవలం నటులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.  మీది 'మంచి సూచన'! అయితే, ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ముందు రాజకీయ నాయకులు కూడా ఇలాంటి టెస్టులు చేయించుకోవాలనే నిబంధన ఉంటే ఎలా ఉంటుంది? అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు విష్ణు. ఓటర్లు కూడా తమ నాయకుడి విషయంలో ఇలాంటి కామన్ ఫ్రేమ్ వర్క్ ను కోరుకుంటున్నారని అన్నారు. జవాబుదారీతనం అనేది అందరికీ వర్తించాలని పేర్కొన్నారు. విష్ణు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

గట్స్ అంటే నీవే భయ్యా!

మంచు విష్ణు స్పందనకు నెటిజన్ల నుండి భారీ మద్దతు లభిస్తోంది. మొదటిసారి మీ మాటలు చాలా గట్టిగా అనిపించాయి బ్రదర్.. గట్స్ అంటే మీవే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం నటులనే విమర్శించడం మానేసి, ప్రజా ప్రతినిధులు కూడా ఆర్థిక పారదర్శకత, క్రమం తప్పకుండా డ్రగ్ టెస్టులు వంటి నిబంధనలకు లోబడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరో వైపు సినిమా నటులు గ్లామర్ ఫీల్డ్‌లో ఉంటారు కాబట్టి వారిపై త్వరగా బురదజల్లడం సులభమని సినీ పెద్దలు వాదిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు చట్టాలను తయారుచేసే స్థానంలో ఉంటారు కాబట్టి, వారి బాధ్యత అంతకంటే ఎక్కువే ఉంటుందని అంటున్నారు. మరి  ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరిస్తారా లేదా విష్ణు లేవనెత్తిన రాజకీయ నాయకుల డ్రగ్ టెస్ట్ ప్రతిపాదనపై ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా అన్నది వేచి చూడాలి.