మొన్న రాహుల్, నిన్న పంత్.. ఈ టార్చరేంటి..? గోయెంకాను బ్యాన్ చేయాలి: ఐపీఎల్ మాజీ చైర్మన్

మొన్న రాహుల్, నిన్న పంత్.. ఈ టార్చరేంటి..? గోయెంకాను బ్యాన్ చేయాలి: ఐపీఎల్ మాజీ చైర్మన్

లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఈయన టార్చరేంటి..? చిన్న చిన్న పొరపాట్లకు క్లాస్ పీకుడేంటి.? ఆటగాళ్ల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈ ఓవరాక్షనేంటి..? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎటు చూసినా ఈ ప్రశ్నలే కనిపిస్తున్నాయి. లేటెస్టుగా గోయెంకా వ్యవహారంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తీవ్రంగా స్పందించారు. 

నేను ఐపీఎల్ క్రియేట్ చేసింది సరదాగా ఆడుకోడానికి.. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. కానీ ఇలాంటి ఓనర్ల వల్ల పొట్టి క్రికెట్ ప్రతిష్ఠ దెబ్బ తింటోంది. గోయెంకా ఒక లూసర్.. జోకర్. అతని బిహేవియర్ తో ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగటానికా నేను ఐపీఎల్ సృష్టించింది..? నేనే ఛైర్మన్, కమిషనర్ గా ఉండుంటే గోయెంకాను బ్యాన్ చేసేవాడిని.. అంటూ ఫైరయ్యారు. 

ఫ్రాంఛైజ్ అగ్రిమెంటులో ఒక క్లాజ్ ఉంది.. బీసీసీఐ సమగ్రత కాపాడేలా వ్యవహరించాలి.. అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని.. లేదా ప్లయేర్లపై ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలి అని ధ్వజమెత్తారు. 

అయితే ఇదే వ్యవహారంపై ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ మైకేల్ వాన్ కూడా కామెంట్ చేశాడు. టోర్నమెంట్ మొదలై ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. దీనికి ఇంత అవసరం లేదంటూ వాన్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. 

  • LSG రెస్పాన్స్ ఏంటి..?

విమర్శలపై లక్నో యాజమాన్యం స్పందించింది. మీరు చేసేదంతా నిజం కాదు. మ్యాచ్ తర్వాతి వైబ్స్ లో.. కెమరా కట్ చేయని విషయాలు చాలా ఉంటాయి. పోస్ట్ మ్యాచ్ లో సరదా విషయాలు చాలా ఉంటాయి.. అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది.

  • ఏంటి వివాదం..?

లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా, తన జట్టు ఆటగాళ్లతో వ్యవహరించే తీరు మొదటి నుంచి వివాదస్పదంగా మారింది. రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఉన్నప్పుడు ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించి, స్టీవ్ స్మిత్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించిన సంజీవ్ గోయెంకా. ఆ తర్వాత 2024 సీజన్‌లో స్టేడియంలోనే కేఎల్ రాహుల్‌ని తిట్టడంతో వివాదాల్లో నిలిచాడు. అయినా అతని పద్ధతిని ఏ మాత్రం మార్చకోలేదు. ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో లక్నో ఓడిపోయిన తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్‌పై అతడు సీరియస్ అయ్యాడు.  

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో 141 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సమీర్ రిజ్వీ హాఫ్ సెంచరీతో ఈ లక్ష్యాన్ని 17.1 ఓవర్లలోనే ఢిల్లీ ఛేదించింది. ఆరంభంలో లక్నో బౌలర్లు వెంటవెంటనే 4 వికెట్లు తీసినప్పటికీ.. సమీర్ రిజ్వీ ( 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 70 పరుగులు) , ట్రిస్టన్ స్టబ్స్ ( 32 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సులతో 39 పరుగులు)  కలిసి 119 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌ని సక్సెస్ ఫుల్ గా ముగించేశారు. 

రిషబ్ పంత్‌తో సీరియస్ చర్చలు: 

ఈ ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా, కెప్టెన్ రిషబ్ పంత్‌తో గ్రౌండ్‌లో సీరియస్‌గా చర్చించడం కెమెరాల్లో కనిపించింది. వాళ్లేం మాట్లాడుకున్నారో వినిపించకపోయినా సంజీవ్ , రిషబ్ పంత్‌కి ఏదో చూపిస్తూ సీరియస్‌గా చెప్పడం, దానికి అతను ముఖం చిన్నబుచ్చుకోవడం నెట్టింట వైరల్ గా మారిన వీడియోల్లో కనిపిస్తుంది. జట్టు పర్ఫామెన్స్ కారణంగా సంజీవ్ గోయెంకాకి కోపం రావడంలో తప్పు లేదు, కానీ ఇలా గ్రౌండ్‌లోకి వచ్చి మరీ ఇంటర్నేషనల్ క్రికెటర్‌ని ఘోరంగా అవమానించడం మాత్రం కరెక్ట్ కాదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. రూ.27 కోట్లు పెట్టి కొనుగోలు చేశామని.. ఎన్ని తిట్టినా భరించాలని అనుకునే కార్పరేట్ పద్ధతి, జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌కి సెట్ కాదనే విషయాన్ని సంజీవ్ గోయెంకా గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 

  • గతంలో కేఎల్ రాహుల్‌ని తిట్టిన సంజీవ్: 

2024 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో, 165  పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కొట్టిన కొట్టుడికి ఈ లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఊదేసింది సన్‌రైజర్స్. ఈ మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా, స్టేడియంలోనే అప్పటి లక్నో టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ని తిట్టడం సంచలనంగా మారింది. 

  • సంజీవ్ గోయోంకా తీరుపై విమర్శలు: 

ఈ ఘటన తర్వాత క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు అందరూ కూడా సంజీవ్ గోయెంకా తీరుని తీవ్రంగా తప్పుబట్టారు. డబ్బులు పెట్టినంత మాత్రాన, అంతర్జాతీయ క్రికెట్ ఆడే ప్లేయర్‌ని ఇలా మైదానంలో ప్రేక్షకులందరి ముందు చివాట్లు పెట్టి, అవమానించడం మంచి పద్దతి కాదని విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో బ్యాడ్ అయిపోవడంతో కేఎల్ రాహుల్‌ని ఇంటికి పిలిచి, డిన్నర్ ఏర్పాటు చేసి సంజీవ్ గోయెంకా ‘సారీ’ చెప్పగా.. అందరి ముందు తిట్టి, ప్రైవేటుగా సారీ చెబితే చెల్లిపోతుందా? అందుకే ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్‌ని వీడి, ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. 

మరిన్ని వార్తలు