ఓ పక్క ఆర్థిక సంక్షోభం.. మరోపక్క పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు ఏకంగా ఆ దేశాన్ని అతలా కుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా లేనతంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉండగా.. తాజాగా గల్ఫ్ లో సంక్షోభం కారణంగా మరోసారి పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. ఎక్కడో కాదు మన పక్క దేశం పాకిస్తాన్ లో.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాకిస్తాన్ పై తీవ్ర ప్రభావం పడింది.లీటర్ పెట్రోల్ ధర 42శాతం, డీజిల్ ధర 54 శాతం పెరగడంతో వాహనాలు బయటకు తీయాలంటే భయపడుతున్నారు పాకిస్తానీలు.
వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం..పాకిస్తాన్ లో లీటరు డీజిల్ ధర 54.9శాతం పెరిగి 520.35 పీకేఆర్ (పాకిస్తాన్ రూపాయలు)కు, పెట్రోల్ ధర 42.7శాతం పెరిగి 458.40 పీకేఆర్ కు చేరుకుంది. దీంతోపాటు కిరోసిన్ ధర కూడా లీటరుకు రూ.34.08 పెరిగి రూ.457.80 కి చేరింది.అమెరికా-ఇరాన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు సంక్షోభంతో ధరలు పెంచక తప్పడంలేదని అని పాకిస్థాన్ పెట్రోలియం శాఖ చెబుతోంది.
నెల రోజులు గడవకముందే పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది రెండోసారి. పశ్చిమాసియా వివాదం భారతదేశ పొరుగు దేశంపై ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందో ఇది సూచిస్తోంది. ఈ భారీ ధరల పెరుగుదల ప్రభావాన్ని కొంత మేర తగ్గించే ప్రయత్నంలో, పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్‌పై లెవీని రూ.105 నుంచి రూ.160కి పెంచినట్లు, అలాగే డీజిల్‌పై ఉన్న రూ.55 లెవీని పూర్తిగా సున్నాకు తగ్గించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. మార్చిలో పాకిస్థాన్ డీజిల్, పెట్రోల్ ధరలను సుమారు 20శాతం పెంచగా, ఇప్పుడు వాటిని వరుసగా 55శాతం, 43శాతం మేర మరింత పెంచింది.
ALSO READ : ఇండియాకు వస్తున్న ఆయిల్ నౌక.. యూటర్న్ తీసుకుని చైనాకు
ఆసియాలోని అనేక దేశాల మాదిరిగానే, పాకిస్థాన్ కూడా తన చమురుకోసం హార్ముజ్ జలసంధి పైనే ఆధారపడి ఉంది. సౌదీ అరేబియా, యూఏఈల నుంచి పాకిస్తాన్ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. హార్ముజ్ జలమార్గం మూసుకుపోవడం, ఇరాన్ ,అమెరికాల మధ్య కాల్పుల విరమణ ఆశలు సన్నగిల్లడంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి పాకిస్థాన్ ఇబ్బందులు పడుతోంది.
పశ్చిమాసియలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ముందుకొచ్చారు. ఇరాన్, అమెరికాల మధ్య చర్చలకు ఇస్లామాబాద్ వేదిక కాగలదని పలు వార్తా నివేదికలు కూడా సూచించాయి. అయితే అప్పటి నుంచి ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదు.
